2వేల కోట్ల అక్రమాలు... ఐటీశాఖ సంచలన ప్రకటన...

తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాలపై ఐటీశాఖ ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణతోపాటు ఢిల్లీ, పుణె సహా 40 చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపిన ఆదాయపు పన్నుశాఖ... వేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖలో దాడులు జరిపినట్లు తెలియజేసిన ఐటీ అధికారులు.... తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో సుమారు 2వేల కోట్ల రూపాయల అవకతవకలను గుర్తించినట్లు ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా మూడు ఇన్ ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులను గుర్తించామని, అలాగే, లెక్కచూపని 85లక్షల నగదును, 71లక్షల విలువైన ఆభరణాలను తమ సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీలు జరిపినట్లు తెలిపింది. ఇక, బోగస్ సబ్ కాంట్రాక్టర్లు నకిలీ బిల్లుల ద్వారా పెద్దఎత్తున నగదు చలామణి చేసినట్లు గుర్తించినట్లు ఐటీశాఖ ప్రకటించింది. అదేవిధంగా 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసినట్లు తెలిపింది. 

ఫిబ్రవరి ఆరు నుంచి దాదాపు వారం రోజులపాటు సాగిన ఐటీ సోదాల్లో విస్మయకర వాస్తవాలు బయటపడ్డాయి. బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, తప్పుడు బిల్లులతో అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 2వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అంచనా వేసింది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ-మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతోపాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు పేర్కొంది

ఏపీ‌, తెలంగాణలో మూడు ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులు జరిగాయి. అయితే, ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిపిన దాడులతో ఈ భారీ రాకెట్ బయటపడినట్లు పేర్కొంది. ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించినట్లు వెల్లడించింది. పన్ను లెక్కలకు దొరకకుండా డొల్ల కంపెనీల ద్వారా 2కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులను దారి మళ్లించినట్లు గుర్తించింది. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించామని... గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడైందని పేర్కొంది.