క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్

 

ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. దాంతో దక్షిణాఫ్రికా ఇంటికి, న్యూజిలాండ్ ఫైనల్‌కి చేరుకున్నాయి. సెమీ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 43 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగించి మ్యాచ్‌ని 43 ఓవర్లకు పరిమితం చేశారు. ఈ 43 ఓవర్లలో న్యూజిలాండ్ 298 పరుగులు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. న్యూజిలాండ్ తన ఇన్నింగ్స్‌ని చాలా దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ మెక్కల్లమ్ కేవలం 22 బంతుల్లో 50 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత 59 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ పరుగుల వేటలో వెనుకబడింది. ఒక దశలో ఓడిపోతుందేమోనన్న సందేహాలు కూడా కలిగించింది. ఎట్టకేలకు 42.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. చివరి బాల్‌కి సిక్స్‌తో న్యూజిలాండ్ విజయం సాధించింది. ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి న్యూజిలాండ్ ఫైనల్‌కి చేరుకుంది. గురువారం జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా - ఆస్ట్రేలియా పోటీ పడనున్నాయి.