ప్రపంచానికి కొత్త వైరస్ ముప్పు

ఒక దాని తరువాత ఒకటి అన్నట్లుగా వైరస్ లు ప్రపంచ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. చైనా నుంచి ఆరంభమై ప్రపంచం మొత్తన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోక ముందే మంకీవైరస్ వ్యాప్తి బెంబేలెత్తిస్తోంది. అంతలోనే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగులోనికి వచ్చింది.

ఈ వైరస్ ను లాంగ్యా హెనిపా వైరస్ అంటున్నారు. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పెంపుడు జంతువుల నుంచే ఈ వైరస్ వ్యాపిస్తోందని చెబుతున్నారు. చైనాలో ఇప్పటికే 35 మంది ఈ వైరస్ బారిన పడి ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా లాగే ఇది కూడా ప్రాణాంతక వైరస్ అని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధి సోకిన వారికి విపరీతమైన జ్వరం, అలసట, దగ్గు, వాంతులు, కండరాల నొప్పి తదితర లక్షణాలు ఉంటాయని, ఈ వైరస్ ప్రభావం లివర్, కిడ్నీల వైఫల్యానికి దారి తీస్తుందని చెబుతున్నారు. అలాగే రక్తంతో ప్లేట్ లెట్స్ సంఖ్య విపరీతంగా పడిపోయి ప్రాణాల మీదకు వస్తుందని చెబుతున్నారు. తొలుత ఈ వైరస్ గురించి తైవాన్ సెంటర్స ఫర్ డిసీజ్ కంట్రోల్ గుర్తించింది.