తెలంగాణలో జోరుగా కొత్త పార్టీల రిజిస్ట్రేషన్.. 

అధికారంలోకి వచ్చేదెవరో, పొత్తులెలా ఉంటాయో అప్పుడే చెప్పలేకున్నా.. తెలంగాణలో మాత్రం కొత్త పార్టీల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉండగానే కొత్త భావాలతో, కొత్త ఎజెండాలతో పార్టీలు రిజిస్టర్ అవుతున్నాయి. మామూలుగా అయితే ఎన్నికలకు 3, 4 నెలల ముందు పార్టీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇది సాధారణం. కానీ ఈసారి వచ్చే ఎన్నికల కోసం చాలా మంది అప్పుడే గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టడం విశేషం. జూన్, జులై మాసాల్లోనే నాలుగు పార్టీలు రిజిస్టరయ్యాయి. 

వైఎస్ షర్మిల నేతృత్వంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) జులై 8న పురుడు పోసుకుంది. అది కాకుండా జున్, జులై మాసాల్లోనే మరో నాలుగు పార్టీలు రిజిస్టర్ కావడం ఆసక్తి రేపుతోంది. అవి.. 1) ప్రజా ఏక్తా పార్టీ (పీఈపీ), 2) జన చైతన్య పార్టీ (జేసీపీ), 3) తెలంగాణ జన జాగృతి పార్టీ (టీజేజేపీ), 4) భారత్ లేబర్ ప్రజా పార్టీ (బీఎల్పీపీ). అదే కోవలో ఇటీవలే గురుకులాల కార్యదర్శిగా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం కొత్త పార్టీకి పథకరచన చేస్తుండడం విశేషం. 

ఇక తెలంగాణలో కామన్ సింబల్ పొందని రిజిస్టర్డ్ పార్టీలు 51 ఉన్నాయి. కామన్ సింబల్ పొందాలంటే మొత్తం సీట్ల నుంచి కనీసం 10 శాతం సీట్లకు పోటీ చేయాలి. అలాగే ఓట్ల శాతం కూడా కనీస నిబంధనల మేరకు నమోదు కావాలి. అలా జరక్కపోతే అలాంటి పార్టీలకు కామన్ సింబల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రద్దు చేస్తుంది. ఈ మేరకు ఆ 51 పార్టీలకు కామన్ సింబల్ ను రద్దు చేయడం జరిగింది. అలా కామన్ సింబల్ రద్దయినవాటిలో జనసేన పార్టీ (గ్లాసు గుర్తు), హిందుస్తాన్ జనతా పార్టీ (కొబ్బరికాయ గుర్తు), మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ యునైటెడ్ (గ్యాస్ సిలిండర్ గుర్తు), ఇండియన్ ప్రజాపార్టీ (విజిల్ గుర్తు) ఉన్నాయి. ఇక విచిత్రంగా పాపులర్ పార్టీల పేర్లతో సారూప్యత కలిగిన పార్టీలు కూడా ఆ 51 పార్టీల జాబితాలో ఉన్నాయి. అలాంటివాటిలో తెలుగు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనం పార్టీ, తెలంగాణ లోక్ సత్తా పార్టీ, తెలంగాణ జనజాగృతి సమితి, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ.. ఇలా ఉన్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నుంచి ఇప్పటివరకు అభ్యంతరాలు రాకపోవడంతో ఈ పార్టీల రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. 

వాస్తవానికి దుబ్బాక ఎన్నికల సమయానికే తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు, పథకరచనలు వేసుకోవడం మొదలైంది. అధికార టీఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దింపేందుకు, టీఆర్ఎస్-ఎంఐఎం స్నేహ బంధం మధ్య చిచ్చు పెట్టేందుకు అన్ని ప్రధాన పార్టీలూ కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో మేము సైతం అంటూ ప్రధాన పార్టీలతో సంబంధం లేకుండా పోటీ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు షర్మిల వంటి రాజకీయ వారసత్వం కలిగిన ప్రముఖులే కాక చిన్నాచితకా వ్యక్తులు, సంస్థలు, ఆశావహులు సైతం తమక్కూడా రాజ్యాధికారం కావాలని, అది లేకుండా సామాజిక న్యాయం సాధించలేమన్న ఉద్దేశంతో పార్టీలు రిజిస్టర్ చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం కష్టమంటున్నారు రాజకీయ నిపుణులు.