ధూంధాంగా కేటీఆర్ బ‌ర్త్‌డే అందుకేనా? ఆ రెండే కార‌ణ‌మా? రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్ ఉందా?

కేటీఆర్ 46వ పుట్టిన‌రోజు వేడుక‌లు హోరెత్తాయి. ఊరూ-వాడ ధూంధాంగా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. రాష్ట్రానికి ఏదో పండ‌గొచ్చిన మాదిరిగా తెలంగాణ వ్యాప్తంగా హంగామా న‌డిచింది. దివ్యాంగుల‌కు త‌న వంతుగా 100 మూడు చ‌క్రాల స్కూట‌ర్లు ప్ర‌క‌టించారు కేటీఆర్‌. ఆయ‌న్ను ఇంప్రెస్ చేయ‌డానికే అన్న‌ట్టు.. ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు మేముసైత‌మంటూ త్రిచ‌క్ర వాహ‌నాలు విత‌ర‌ణ చేశారు. ఇక గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కేటీఆర్‌పై ప్ర‌త్యేక సాంగ్స్‌తో ఊద‌ర‌గొట్టారు ఆయ‌న అనుచ‌రులు. కేక్ క‌టింగ్స్‌, సోష‌ల్ మీడియా విషెష్‌కైతే లెక్కేలేదు. ఇక ముక్కోటి వృక్షార్చ‌న వీట‌న్నిటికంటే హైలైట్‌. గ్రామ గ్రామాన మొక్క‌లు నాటి.. కేటీఆర్ బ‌ర్త్‌డే అనే సంగ‌తి అంద‌రికీ తెలిసేలా, గుర్తుండిపోయేలా రికార్డు సృష్టించారు. ఇలా, జులై 24ను తెలంగాణ‌లో ఉత్స‌వంగా నిర్వ‌హించారు టీఆర్ఎస్ శ్రేణులు. 

ఇదంతా కేటీఆర్ డైరెక్ష‌న్‌లోనే జ‌రిగింద‌ని అంటున్నారు. ఆయ‌న ఇషారా ఇచ్చాకే గులాబీ ద‌ళం ఇంత‌లా హంగామా చేసిందంటున్నారు. వాన‌లు, క‌రోనా క‌ష్టాలు ఇవేమీ ప‌ట్ట‌కుండా పుట్టిన‌రోజును పండగ‌లా జ‌ర‌ప‌డం వెనుక రాజ‌కీయ వ్యూహం ఉంద‌ని చెబుతున్నారు. కేటీఆర్‌ను బ‌ల‌మైన లీడ‌ర్‌గా ఊద‌ర‌గొట్ట‌డానికి, ఆయ‌న‌కు తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంద‌ని అనిపించ‌డానికి, కేటీఆర్ ఫాలోయింగ్ ఎంతో చూపించ‌డానికే.. ఇలా బ‌ర్త్‌డే వేడుక‌ల‌తో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగార‌ని అంటున్నారు. అందుకు ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు చెబుతున్నారు. ఆ రెండు రీజ‌న్సూ ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తున్నాయి. 

కేటీఆర్ క్లాస్ లీడ‌ర్‌. ఎంత మాస్‌గా మాట్లాడినా కేసీఆర్‌లా మాస్ గుర్తింపు రాలేదు. క్లాస్ అనేది కొన్ని వ‌ర్గాల‌కే న‌చ్చుతుంది. అదే మాస్ ముద్ర ఉంటే అంద‌రివాడు అవుతాడు. తెలంగాణ‌లో అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న లీడ‌ర్లు ఇద్ద‌రే ఇద్ద‌రు. ఒక‌రు కేసీఆర్‌. ఇంకొక‌రు రేవంత్‌రెడ్డి. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్.. తెలంగాణ బాహుబ‌లి అయ్యారు. కొన్ని వారాలుగా రాష్ట్రంలో రేవంత్ పేరే మారుమోగుతోంది. రేవంత్ హంగామాకు బ్రేకులేసి.. ఒక్క‌సారిగా ఆ స్థానంలోకి కేటీఆర్ రావాలంటే.. ఎదైనా బిగ్ యాక్టివిటీ తీసుకురావాల‌ని భావించార‌ట‌. టాపిక్ రేవంత్‌రెడ్డి నుంచి మ‌రో అంశం వైపు డైవ‌ర్ట్ అవ్వాల‌ని స్కెచ్ వేశార‌ట‌. అందుకే, ద‌ళిత బంధును ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల్లో చ‌ర్చ రేపారు. అదే స‌మ‌యంలో కేటీఆర్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌తో ధూంధాంగా నిర్వ‌హించి యావ‌త్‌ తెలంగాణలో కేటీఆర్ పేరు మారుమోగేలా ప్లాన్ చేశార‌ని అంటున్నారు. రోజంతా, రాష్ట్ర‌మంతా కేటీఆర్ పేరే వినిపించ‌డం.. కేటీఆర్ ఫోటోలే క‌నిపించ‌డం.. కేటీఆర్ గురించే మాట్లాడుకోవ‌డం.. కేటీఆర్ పాట‌లే వినిపించ‌డం.. ఇలా పుట్టిన‌రోజు వేడుక‌లతో తెలంగాణ‌ను కేటీఆర్ మ‌యం చేసేశార‌ని చెబుతున్నారు. పాట‌ల్లో కూడా మాస్ ట‌చ్ ఉండేలా చూసి.. కేటీఆర్‌ను మాస్ లీడ‌ర్‌గా ప్ర‌మోట్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని.. న‌గ‌రాల‌తో పాటు గ్రామాల్లోనూ కేటీఆర్ హ‌వా క‌నిపించేలా.. గ్రామ‌గ్రామాల్లో ఆయ‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌గాల‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఘ‌నంగా కేటీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌ర‌ప‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే దాగుంద‌ని అంటున్నారు. ఇక మ‌రో కార‌ణం ఏంటంటే.....

ముఖ్య‌మంత్రి కావ‌డం కేటీఆర్ చిర‌కాల వాంచ‌. గ‌తంలోనే అనేక‌మంది మంత్రులు ఆ విష‌యాన్ని బ‌హిరంగంగానే ప్ర‌స్తావించి కేటీఆర్ కాబోయే సీఎం అంటూ స్వామి భ‌క్తి చాటుకున్నారు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌య‌త్నించినా.. చివ‌రి క్ష‌ణంలో ఏదో కార‌ణాల‌తో అది వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోతుండ‌టం.. పార్టీలో కుట్ర‌దారులు పెరిగిపోతుండ‌టంతో.. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా కేటీఆర్‌ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టాల‌ని కేసీఆర్ సైతం భావిస్తున్నార‌ట‌. అయితే, ఎప్ప‌టిక‌ప్పుడు ఉప ఎన్నిక‌లు రావ‌డం.. ఈట‌ల రాజేందర్ ఎపిసోడ్‌తో అది మ‌రింత ఆల‌స్యం అవుతోంది. ఈసారి హుజురాబాద్ ఎన్నిక‌లు ముగియ‌గానే.. కేటీఆర్‌కు ముఖ్య‌మంత్రి కిరీటం ప‌క్కా అంటున్నారు. పార్టీ అంతా కేటీఆర్ వెంటే ఉంద‌నే మెసేజ్ ఇవ్వ‌డానికి.. పార్టీలో, ప్ర‌భుత్వంలో కేటీఆరే సూప‌ర్ లీడ‌ర్ అని అనిపించ‌డానికి.. ఇలా అట్ట‌హాసంగా కేటీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రిపార‌ని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌, బండి సంజ‌య్‌ల రాజ‌కీయ దూకుడుతో డ‌ల్‌గా మారిన‌ గులాబీ కేడ‌ర్‌లో ఉత్సాహం నింపడానికే.. కేటీఆర్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ధూంధాంగా నిర్వ‌హించార‌ని అంటున్నారు. మ‌రి, ఈ జోష్ ఎన్నిరోజులు ఉంటుందో....