ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయం

తెలంగాణలోని రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.  అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్న చరిత్రాత్మక రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్టు యునెస్కో ప్రకటించింది. చైనాలో జరిగిన ఓ వర్చువల్ సమావేశంలో ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కాకతీయ రాజుల కాలం నాటి శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప గుడి రికార్డులకెక్కింది. 2020 సంవత్సరానికి గాను భారత్ నుంచి ఇదొక్క ఆలయమే నామినేట్ అయింది. 2019లో యునెస్కో ప్రతినిధులు రామప్ప గుడిని సందర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా 42 కట్టడాలను ఈసారి గుర్తింపు ఇవ్వగా మన దేశం నుంచి రామప్ప ఆలయానికి మాత్రమే అవకాశం దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. రామప్ప గుడి ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల కిందట కాకతీయుల హయాంలో నిర్మితమైంది. అపురూప శిల్పాలకు చిరునామాగా విలసిల్లే రామప్ప గుడి ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. 

ఈ గుడి శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి రావడం విశేషం అని చెప్పాలి. ఇది ప్రధానంగా శివాలయం. ఇందులో రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. దీన్ని కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఆ కాలంలో ఇంతటి అద్భుత శిల్పకళా నైపుణ్యంతో మరే ఆలయం లేకపోవడంతో, అందులోని దేవుడి పేరుమీద కాకుండా, ఆలయాన్ని తీర్చిదిద్దిన శిల్పి రామప్ప పేరిట పిలవడం ప్రారంభించారు.యునెస్కో గుర్తింపుతో ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది.

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రామప్ప ఆలయాన్ని సందర్శించి, గొప్పదనం గురించి ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలని కోరారు. కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయం అని కొనియాడారు.

కాకతీయుల శిల్పకళా వైభవం రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రామయ్య ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం సంతోషకరమంటూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు.  తెలంగాణ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప ఆలయం అని తెలిపారు. ఈ సందర్భంగా యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించిన అందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తర్వాత హైదరాబాద్‌కు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపు.. మన తదుపరి లక్ష్యమని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.