అమ్మకు అన్నం పెట్టలేనోడు.. జగన్ డైలాగ్.. సోషల్ మీడియాలో యమా ట్రోలింగ్!

అమ్మ‌కు అన్నం పెట్ట‌లేనోడు.. పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తాన‌న్న‌ట్టు చంద్ర‌బాబు వ్య‌వ‌హారం ఉంద‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. కూతురిని ఇచ్చిన మామ‌కు వెన్నుపోటు పొడిచిన వాడు.. పేద‌ల‌కు వెన్నుపోటు పొడ‌వ‌కుండా ఉంటాడా? అంటూ ప్రశ్నిస్తూ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల‌లో వ‌రిక‌పూడిశెల ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి శంకుస్థాప‌న చేసిన అనంత‌రం మాట్లాడిన సీఎం జగన్ యధావిధిగా ముందే ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును తల ఎత్తకుండా చదువుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

14 ఏళ్లు సీఎంగా చేసిన వ్య‌క్తి ఈ వ‌రిక‌పూడిశెల ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి క‌నీసం అనుమ‌తులు కూడా తీసుకురాలేక‌పోయార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అన్ని అనుమ‌తులు తీసుకుని ఇప్పుడు శంకుస్థాప‌న చేశామని చెప్పుకొచ్చారు. ఇక పేద‌లు, మ‌హిళ‌ల కోసం ఒక్క ప‌థ‌కం పెట్టిన చ‌రిత్ర కూడా చంద్ర‌బాబుకు లేద‌న్న జగన్.. చంద్ర‌బాబు త‌న బినామీల భూముల ధ‌ర‌లు పెంచుకునేందుకే అమ‌రావ‌తి రాజ‌ధానిని ఎంచుకున్నారని విమ‌ర్శించారు. బీసీల తోక‌లు క‌ట్ చేస్తాన‌ని చంద్రబాబు అహంకార పూరితంగా మాట్లాడార‌ని, ఎస్సీల్లో ఎవ‌రైనా పుట్టాల‌నుకుంటారా? అని అన్నార‌ని జగన్ కులాలను కూడా టచ్ చేస్తూ విమర్శలు చేశారు.

అయితే  సీఎం జగన్ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎలాంటి కార్యక్రమానికి హాజరైనా.. ఎలాంటి స్పీచ్ ఇచ్చినా అది సోషల్ మీడియాలో   తెగ వైరల్ అయిపోతోంది. ఆయన పార్టీ కార్యక్రమాలలో ఎప్పుడూ పాల్గొనరు.. ఆయన ప్రభుత్వ కార్యక్రమాలనే పార్టీ కార్యక్రమాలుగా మార్చేసుకుని ప్రసంగాలు దంచేస్తుంటారు. తాజాగా వరికిపూడిశెల ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో కూడా అదే చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ ప్రసంగంపై నెటిజెన్లు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు.  ముఖ్యంగా అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు గాజులు, మామ‌కు వెన్నుపోటు పొడిచిన వాడు.. పేద‌ల‌కు వెన్నుపోటు పొడ‌వ‌డా అనే డైలాగులను మీమర్లు తెగ వాడేసుకుంటున్నారు. తల్లి విజయమ్మను పక్క రాష్ట్రానికి తరిమేసి ఇక్కడ అమ్మకు అన్నం పెట్టలేనోడు అంటూ సామెతలు చెప్పడాన్ని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు. జగన్ తల్లి ఫోటోతో సహా జగన్ డైలాగ్ కలిపిన యూట్యూబ్ షాట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మామకు వెన్నుపోటు డైలాగుకు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఫోటోను కలిపి.. బాబాయికి గొడ్డలి పోటు పొడిచినోడు పేదలకు కత్తి పోటు పొడవడా అంటూ కౌంటర్ యూట్యూబ్ షాట్స్ హల్ చల్  చేస్తున్నాయి.

ముఖ్యంగా చంద్ర‌బాబు త‌న బినామీల భూముల ధ‌ర‌లు పెంచుకునేందుకే అమ‌రావ‌తి రాజ‌ధానిని ఎంచుకున్న్నారన్న వ్యాఖ్యలపై విపరీతంగా కౌంటర్లు వేస్తున్నారు. మూడు రాజధానులని, మూడు ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం చేస్తానంటూ జగన్ నాలుగున్నరేళ్లగా మాయ మాటలతో ఆరు కోట్ల ఆంధ్ర ప్రజలను దగా చేస్తున్నాడని నెటిజనులు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే చంద్రబాబు కట్టిన అమరావతి నుండే పాలన చేస్తూ.. అమరావతిని చంపేందుకు జగన్ చేస్తున్న కుట్రలను ఘోరంగా తూర్పార పడుతున్నారు.  పేద‌లు, మ‌హిళ‌ల కోసం చంద్రబాబు ఒక్క ప‌థ‌కం తెచ్చారా? అనే ప్రశ్నపై టీడీపీ శ్రేణులు ఆధారాలతో సహా ఏకిపారేస్తున్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత తెలుగుదేశం దే కాగా తొలిసారిగా మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు, 5 మంత్రి పదవులు ఇచ్చి ఎన్టీఆర్ రాజకీయాలలో మహిళల ప్రాధాన్యత పెంచారు. అలాగే చంద్రబాబు శాసనసభకు తొలి మహిళా స్పీకరును అందించారు. 

అలాగే గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు చంద్రబాబు తీసుకొచ్చిన ‘డ్వాక్రా’ సంఘాలు తెలుగునాట ఊరూరా ఓ విప్లవాన్ని తీసుకువచ్చాయి. ఇప్పుడు ఈ డ్వాక్రా సంఘాలు ఏ స్థాయిలో విజయవంతం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ మహిళలు అష్టకష్టాలూ పడేవారు. ఆ పరిస్థితి నుండి   'దీపం' పథకాన్ని ప్రవేశపెట్టి ఆ రోజుల్లోనే దాదాపు 33 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మహిళల కష్టాలను తీర్చిన  ఘనత చంద్రబాబుదే. విద్య, ఉపాధి రంగాలలో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు,  డీఎస్సీ వంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మహిళలకు పెద్ద పీట వేయడంతో ఇప్పుడు ప్రతి పది మంది మహిళా టీచర్లలో ఆరుగురు ఆనాడు ఎంపికైన వారే ఉన్నారు. ఇక తెలుగుదేశం అంటేనే బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీగా గుర్తింపు పొందింది. . తెలుగుదేశం ప్రభుత్వాలలో బీసీ నేతలే అత్యున్నత పదవులను అనుభవించారు. అలాగే అప్పట్లోనే చంద్రబాబు బీసీల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారికి ఉపాధి కల్పిస్తూ దన్నుగా నిలిచారు. ఎస్సీల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టి ఆర్ధికంగా ఎదిగే అవకాశాన్ని కల్పించింది కూడా చంద్రబాబే. దీంతో వీటన్నిటినీ ఉదహరిస్తూ టీడీపీ శ్రేణులు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu