నవనీత్ కౌర్ కు సుప్రీంలో భారీ ఊరట
posted on Apr 4, 2024 4:50PM
సినీ నటి, లోక్ సభ సభ్యురాలు నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ కు సంబంధించి సుప్రీంకోర్టు సానుకూల తీర్పును వెలువరించింది. నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ గతంలో బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీర్పును కొట్టేసింది.
2019 ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. శివసేన అభ్యర్థి ఆనందరావుపై ఆమె విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె నకిలీ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ తో ఎన్నికల్లో పోటీ చేశారని ఆనందరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమెది నకిలీ కుల ధ్రువీకరణ పత్రం అని గుర్తించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ ను రద్దు చేయడంతో పాటు... రూ. 2 లక్షల జరిమానా విధించింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో నవనీత్ కౌర్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. అమరావతి టికెట్ ను ఆమెకు బీజేపీ కేటాయించింది.
నకిలీ సర్టిఫికేట్ స్టోరి ఇదే
నవనీత్ రాణా 2013లో క్యాస్ట్ సర్టిఫికెట్ పొందారు. నవనీత్ రానాకు మోచి కులం సర్టిఫికెట్ ఇచ్చారు. ఆమె సర్టిఫికేట్ కుల ధృవీకరణ కమిటీ ద్వారా ధృవీకరించబడింది. అయితే దానిని వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ ఆనందరావు అడ్సుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదనంతరం, బాంబే హైకోర్టు కుల పరిశీలన కమిటీ నిర్ణయాన్ని రద్దు చేసి నవనీత్ కౌర్ సర్టిఫికేట్ చెల్లదని తీర్పును వెలువరించింది. అమరావతి లోక్‌సభ నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడింది. నవనీత్ రాణా ఈ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆమె కుల ధ్రువీకరణ పత్రం బోగస్ అంటూ శివసేన మాజీ ఎంపీ ఆనందరావు అద్సుల్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో నవనీత్ కౌర్ చెప్పులు కుట్టే వర్గానికి చెందిన ఆమె కాదని, ఆమె భర్త చర్మకారుడని తెలిపారు. దీనిపై పరిశీలించిన బాంబే హైకోర్టు ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లదని జూన్ 2021లో తీర్పునిచ్చింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవనీత్ రాణా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని, ఈ కుల ధృవీకరణ పత్రం చెల్లుతుందని సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆమె నామినేషన్ దాఖలు ప్రక్రియ సుగమం అయింది