కేబినెట్ పదవి పై క్లారిటీ ఇచ్చిన లోకేశ్...

 

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేబినెట్ పదవిపై ఎప్పటినుండో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు లోకేశ్ కోసం ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు సైతం రాజీనామాలు చేస్తామంటూ త్యాగాలు చేసేస్తున్నారు. అయితే దీనిపై లోకశ్ ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ.. ఇప్పుడప్పుడే కేబినెట్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం లేదని.. 2019లో జరిగే ఎన్నికల నాటికి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో పాటు కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టేందుకు రెడీ అవుతానని చెప్పారు. దీంతో లోకేశ్ కేబినేట్ పదవిపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు.

 

కాగా చంద్రబాబు నాయుడు లోకేశ్ కు ఇప్పుడప్పుడే కేబినెట్ పదవి కట్టబెట్టడానికి సముఖత చూపించనట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి లోకేశ్ కోసం త్యాగం చేద్దామనుకున్న వారికి ఆ అవకాశం లేకుండా పోయింది.