వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇద్దరు నానిల ఆతృత!
posted on Jun 17, 2012 10:16AM
ఉపఎన్నికల్లో విజయఢంకా మోగించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు నానిలు ఇద్దరూ ఆతృతపడుతున్నారు. ఇంకా ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్న వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేసేందుకు తొందరపడుతున్నారు. ముందుగా జగన్ తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని వీరిద్దరూ రాజధానికి వెళ్ళారు. చెంచల్ గూడ జైలులో జగన్ ను కలిగిన తరువాత తమ రాజీనామాలను సమర్పించేందకు సిద్ధపడ్డారు. తెలుగుదేశంపార్టీ కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఇక తన ఆతృతను ఆపుకోలేక అభిమానుల పేరిట తానే స్వయంగా చేయించిన ఫ్లెక్సీలను లింగవరం ప్రాంతంలో ప్రదర్శించారు. ఈ ఫెక్సీల్లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి, జగన్ లతో నాని ఉన్న చిత్రం కనిపిస్తోంది. పేరుకు మాత్రం అభిమానుల ఫోటోలు, పేర్లు మాత్రం ఆ ఫ్లెక్సీల్లో కిందభాగాన రాయించారు.
ఇలా ప్రచారం జరిగాక ఆయన రాజధాని బయలుదేరి వెళ్ళారు. ఇక మరో ఎమ్మెల్యే ఆళ్ళ నాని విషయానికి వస్తే తనతోపాటు వెనుక వచ్చే కాంగ్రెస్ ద్వితీయశ్రేణి నాయకులను లెక్కించే పనిలో మొన్నటివరకూ బిజీగా ఉన్నారు. తన వెనుక వచ్చేవారందరినీ సిద్ధం చేసుకున్న ఈ ఏలూరు ఎమ్మెల్యే ఫలితాలు వచ్చిన దగ్గరనుంచి జగన్ ను కలిసి తన సంతోషాన్ని పంచుకోవాలని ఆరాటపడ్డారు. అంతేకాకుండా తన రాజీనామా సమయం గురించి చర్చించాలని ఉత్సాహంగా రాజధానికి బయలుదేరుతున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు.