హెచ్చరిక బోర్డు లేకపోవడం వలననే అక్కడ ప్రమాదాలు

 

నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ శనివారం సాయంత్రం నల్గొండ జిల్లాలో ఆకుపాముల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎదురుగా రాంగ్ డైరెక్షన్ లో వరి లోడుతో వస్తున్న ఒక ట్రాక్టర్ ను తప్పించబోయి ప్రమాదంలో చిక్కుకొని ఆయన మరణించారు. ఆ హైవే రోడ్డుపై ఆ ప్రాంతంలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేని కారణంగానే తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెపుతున్నారు. హైదరాబాద్-విజయవాడ రహదారి వెడల్పు చేసినప్పుడు, ఆకుపాముల గ్రామం వద్ద రోడ్డును క్రాస్ చేసేందుకు ఇచ్చిన రోడ్డు కటింగ్ వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయలేదు.  

 

ఆ కారణంగా నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు కొంత దూరం రాంగ్ రాంగ్ డైరెక్షన్ లో పయనిస్తూ యూ టర్న్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తూ అటునుండి వేగంగా వచ్చే వాహనాలకు ఎదురువస్తుంటారు. ఆ సమయంలో ఎవరో ఒకరు ప్రమాదం పాలవుతుంటారు. జానకీరామ్ అటువంటి ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. హైవే రోడ్డులో రాంగ్ రూట్ లో అకస్మాత్తుగా ఎదురు వచ్చిన ట్రాక్టర్ ను తప్పించబోయి కారు అదుపు తప్పడంతో జానకీరామ్ మృతి చెందారు. ఈ ప్రాంతంలో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని స్థానికులు చెపుతున్నారు. కానీ ప్రమాదం బారినపడినవారు సాధారణ పౌరులే కావడంతో అవి యాక్సిడెంట్ వార్తల కాలంలలో ఎక్కడో మూలపడి కనబడకుండా కొట్టుకుపోతుంటాయి. కానీ, ఇప్పుడు చనిపోయింది ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ విషయం బయటపడింది.

 

ఇకనయినా అధికారులు మేల్కొని హైవేపై అవసరమయిన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ఇటువంటి ప్రమాదాలు నివారించవచ్చును. జానకీరామ్ మృతదేహానికి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించిన తరువాత హరికృష్ణ కుటుంబానికి అప్పజెప్పుతారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu