ఏపీలో ఉద్యోగులు నోరు కుట్టుకుని పని చేయాలి..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచంలో అన్ని దేశాల్లో ముందు వరుసలో పనిచేస్తున్న సిబ్బంది రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్నారా? మీకు మాస్కులు లేకపోయినా, గ్లౌజులు ఇవ్వకపోయినా, పీపీఈ లు ఇవ్వకపోయినా బయటకు చెప్పొద్దు. పోలీసులు, మునిసిపాలిటీ సిబ్బంది, డాక్టర్లూ ఎవరైనా సరే. నోరు మూసుకుని పని చేయాల్సిందే.

అలా కాకుండా బయటకు చెప్పారా? మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తారు. మాస్కులు లేవని, ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు లేవని చెప్పిన నర్సీపట్నం సీనియర్ వైద్యుడు డాక్టర్  సుధాకర్‌రావు ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు నగరి మున్సిపల్ కనిషనర్‍పై సస్పెన్షన్ వేటు వేసింది.

నగరి మునిసిపల్ కమిషనర్ చేసిన తప్పల్లా ఒక్కటే తమకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోయినా తాము ప్రజలకు సేవ చేస్తున్నామని. అదీ కూడా వేరే సందర్భంలో చెప్పారు. నగరిలో మాంసం దుకాణాలు మూసేయమని ఇచ్చిన తాకీదుపై కొందరు విమర్శలు చేస్తుంటే దానికి సమాధానంగా ఆయన మాట్లాడారు.

కరోనా అంటే భయం లేకుండా తమ సిబ్బంది పని చేస్తున్నారని, తామే కాకుండా పోలీసులు కూడా అలానే పని చేస్తున్నారని, చేతికి గ్లౌజెస్ కూడా ఉండటం లేదని ఆయన అన్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ మాత్రం నిందించలేదు. తాము చేస్తున్న సేవను మాత్రమే చెప్పారు.

అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం హర్ట్ అయింది. సస్పెండ్ చేసింది. నగరి కమిషనర్ కామెంట్లను సీరియస్‍గా తీసుకున్న ఏపీ సర్కార్ సివిల్ సర్వీసెస్ నిబంధనలకు విరుద్దంగా కమిషనర్ వ్యవహరించారని భావించింది. వెంటనే సస్పెండ్ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా నగరి దాటి వెళ్లొద్దని చెప్పింది. నగరి మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్‍గా సీహెచ్ వెంకటేశ్వరరావును నియమించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu