ముత్తూట్‌ గ్రూప్ ఛైర్మన్‌ దుర్మరణం

ముత్తూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ మత్తయ్య జార్జ్ ముత్తూట్  కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడి మరణించినట్టు తెలుస్తోంది.  ఎంజీ జార్జ్ ముత్తూట్  హఠాన్మరణంపై వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

1949, నవంబరులో కేరళలోని పఠనమిట్ట జిల్లాలోని కోజెన్‌చేరిలో జన్మించారు జార్జ్‌ ముత్తూట్‌. కుటుంబ వ్యాపారంలో చిన్న వయస్సులోనే ప్రవేశించారు. 1979లో మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిని చేపట్టిన ఆయన 1993 లో ముత్తూట్‌  గ్రూపు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి జార్జ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 51 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించింది. దీంతో కంపెనీ ఆదాయం 8వేల 722 కోట్ల రూపాయలకు చేరింది. ఆయనకు భార్య సారా జార్జ్‌, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు జార్జ్ ఎం జార్జ్ ఈ బృందానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాగా, చిన్న కుమారుడు అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్‌ గా ఉన్నారు. కాగా  రెండవ కుమారుడు పాల్ ముథూట్ జార్జ్ 2009 లో హత్యకు గురయ్యారు.