ఏపీలో మైనార్టీలకు అన్యాయం.. జగన్ పై అసద్ సంచలనం! 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మద్దతు ఇస్తూ వస్తోంది ఎంఐఎం పార్టీ. సీఎం జగన్ కు ఓపెన్ గానే సపోర్ట్ చేశారు పతంగి పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జగన్ మద్దతుగా ప్రకటనలు చేశారు అసద్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మైనార్టీలంతా జగన్ పార్టీకి మద్దతుగా ఉండాలని పిలుపిచ్చారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. జగన్ కు ఫుల్ సపోర్టుగా ఉన్న అసద్.. తీరులో ఇప్పుడు మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.  

కర్నూల్ పర్యటనకు వచ్చిన అసదుద్దీన్.. జగన్ రెడ్డి సర్కార్, వైసీపీ నేతల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సమావేశానికి సీఎం జగన్‌ అనుమతి ఇవ్వలేదని ఎంఐఎం ఎంపీ ఆరోపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి బేకార్ అని అసదుద్దీన్‌ ఎద్దేవా చేశారు.  జగన్ మైనార్టీలను ఓటు రూపంలో వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం జగన్‌రెడ్డి గాలికి వదిలేశారని అసదుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన, వైసీపీ నేతల తీరుపై కర్నూల్ లో అసద్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.