సంగీత దర్శకుడు శ్రీ మృతి

 

గత ఏడాది కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖ నటులు, సంగీత దర్శకులు, నిర్మాతలు అకాల మరణం చెందుతుండటంతో తెలుగు ప్రజలు, సినీ పరిశ్రమలో వ్యక్తులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ దోష నివారణ కోసం సినీ పరిశ్రమలో వారు మాహా మృత్యుంజయ హోమం కూడా చేసారు. అయినప్పటికీ సినీ పరిశ్రమను మృత్యుదేవత నీడలా వెంటాడుతూనే ఉంది. గత కొంత కాలంగా అస్వస్థతో ఉన్న ప్రముఖ యువ దర్శకుడు శ్రీ (49) శనివారం సాయంత్రం హైదరాబాద్, కొండాపూర్ లోని తన స్వగృహంలో మరణించారు. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడు. ఆయన పూర్తి పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. సినీ పరిశ్రమలోకి రాకూడదనుకొంటూనే ఆయన ‘పోలీస్ బ్రదర్స్’ సినిమాతో సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మనీ మనీ, సింధూరం, అనగనగా ఒకరోజు, ఆవిడా మా ఆవిడే, గాయం, అమ్మోరు తాడిత సినిమాలు ఆయనకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయన తన ప్రతిభను నిరూపించుకొన్నప్పటికీ సినీ పరిశ్రమలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పలేదు.

 

ఆయన మంచి నేపద్య గాయకుడు కూడా. చక్రం, గాయం, అమ్మోరు సింధూరం సినిమాలలో ఆయన పాడిన పాటలు ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ముఖ్యమగా చక్రం సినిమాలో ‘జగమంత కుటుంబం నాది’ అనే పాట ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆయన నేపద్య గాయని స్మితతో కలిసి ‘హాయ్ రబ్బా’ అనే ప్రైవేట్ ఆల్బం కూడా రూపొందించారు. ఆయన కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. సాయిరామ్ శంకర్ నటించిన 143సినిమాలో సాయిరామ్ కు ఆయనే డబ్బింగ్ చెప్పారు. సినీ పరిశ్రమలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నప్పటికీ సినీ పరిశ్రమలో ఆయన ఇమడలేకపోయేవారు. జగమంత సినీపరిశ్రమలోతను ఎప్పుడూ ఏకాకిగానే ఉన్నట్లు అనుభూతి చెందేవాదినని ఆయనే స్వయంగా అనేకసార్లు చెప్పుకొన్నారు.

 

ఆయన చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా తండ్రికి తీసిపోని తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu