ముంబై ఉగ్ర దాడుల వేళ పాకిస్థాన్‌లో భారత కీలక అధికారులు: యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మక కుట్రా.?
Published on: Fri Nov 27, 2026 3:35PM

2008 నవంబర్ 26న దేశ ఆర్థిక రాజధాని ముంబైపై పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన మారణహోమం భారత భద్రతా చరిత్రలో అత్యంత విషాదకరమైన, సంచలనాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. నాలుగు రోజుల పాటు సాగిన ఆ వరుస దాడుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులతో సహా మొత్తం 175 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ భయానక దాడులు జరిగిన సమయంలో భారత అంతర్గత భద్రతా యంత్రాంగానికి చెందిన అత్యున్నత నిర్ణయాధికారులు దేశంలో లేకపోవడం, పాకిస్థాన్‌లోని ఓ మారుమూల హిల్ స్టేషన్లో బస చేయడం ఇప్పటికీ అనేక సందేహాలకు తావిస్తోంది. ముంబై దాడుల సమయంలో ప్రభుత్వ ప్రతిస్పందన ఆలస్యం కావడానికి ఆ పరిస్థితులు కారణమయ్యాయా? లేక భారత భద్రతా వ్యవస్థను స్తంభింపజేయడానికి పాకిస్థాన్ పన్నిన వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే అది జరిగిందా? అనే ప్రశ్నలు దాడులు జరిగిన పద్దెనిమిదేళ్ల తరువాత కూడా చర్చనీయాంశంగానే ఉన్నాయి. దాడులు జరిగిన సమయంలో సంక్షోభ నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తొమ్మిది మంది సీనియర్ భారత అధికారుల బృందం పాకిస్థాన్ పర్యటనలో ఉండటం అప్పట్లో చాలా మందికి తెలియని అంశం. నాటి కేంద్ర హోం కార్యదర్శి మధుకర్ గుప్తా నేతృత్వంలోని ఈ బృందంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ సహా ఇతర భద్రతా సంస్థలకు చెందిన కీలక అధికారులు ఉన్నారు. ముంబైలో ఉగ్రదాడులు జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు, అంటే 2008 నవంబర్ 24న ఈ బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం వారు నవంబర్ 26న తిరిగి ఇండియాకు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ, అనూహ్యంగా వారి పర్యటనను మరో రోజు పొడిగించారు.
ఇస్లామాబాద్‌కు ఈశాన్యంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రీ అనే హిల్ రిసార్ట్‌కు ఆ బృందాన్ని తరలించారు. నివేదికల ప్రకారం అక్కడ కనీస టెలిఫోన్ కనెక్షన్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ముర్రీ పర్యటనపై తలెత్తిన విమర్శలు, అనుమానాలపై మాజీ హోం కార్యదర్శి మధుకర్ గుప్తా 2016లో స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. భారత అధికారులు పాకిస్థాన్ ఆతిథ్యాన్ని ఆస్వాదించడానికి అక్కడ ఉండిపోయారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తమ అంతర్గత మంత్రితో సమావేశం కావాలని పాకిస్థాన్ పట్టుబట్టడం వల్లే బసను పొడిగించాల్సి వచ్చిందని వివరించారు. అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే, రెండు రోజులు ఇస్లామాబాద్‌లోనే ఉన్నప్పటికీ చివరి రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ముర్రీ హిల్ రిసార్ట్‌కు ఈ బృందాన్ని తరలించడం వెనుక దాడులపై భారతదేశ స్పందనను ఆలస్యం చేయడం లేదా బలహీనపరిచే కుట్ర ఉందన్న అనుమానం తమను వేధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ముర్రీలో టెలివిజన్ సిగ్నల్స్ లేవన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చుతూ.. భారత్ నుంచి ఫోన్ కాల్ రాగానే టీవీ ఆన్ చేసి వార్తలు చూసి ఢిల్లీలోని సీనియర్ నాయకత్వాన్ని సంప్రదించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు, ముంబై వీధుల్లో ఏకే-47 తుపాకులతో విరుచుకుపడిన పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మంది భద్రతా దళాల కాల్పుల్లో హతమవ్వగా, అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా చిక్కడం మొత్తం కేసు స్వరూపాన్ని మార్చివేసింది. ముంబై పోలీసు విభాగానికి చెందిన కానిస్టేబుల్ తుకారాం ఓమ్బ్లే తన శరీరంలోకి 23 బుల్లెట్లు దూసుకుపోతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కసబ్ తుపాకీ బ్యారెల్‌ను గట్టిగా పట్టుకుని నిలువరించాడు. అతడిని నిలువరించడానికి తాను ప్రాణత్యాగం చేశారు. ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాల వల్లే కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు.
సుదీర్ఘ న్యాయప్రక్రియ అనంతరం 2012 నవంబర్ 21న పూణేలోని యెరవాడ జైలులో కసబ్‌ను ఉరితీశారు. కసబ్ సజీవంగా దొరకకపోయి ఉంటే, అతని చేతికి కట్టిన కాషాయం దారం, జేబులో ఉన్న హిందూ పేరుతో కూడిన నకిలీ గుర్తింపు కార్డు ఆధారంగా ఈ దాడులను హిందూ సంఘాల ఖాతాలో వేసే కుట్ర జరిగి ఉండేదనీ.. తద్వారా ఆర్ఎస్ఎస్ సహా పలు సంస్థలపై శాశ్వత నిషేధం విధించే ప్రయత్నాలు జరిగేవని పరిశీలకులు అంటున్నారు. దేశ రక్షణలో అత్యున్నత త్యాగం చేసిన తుకారాం ఓమ్బ్లేకు 2009లో మరణానంతరం అశోక చక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ చట్ట అమలు సంస్థలు, భద్రతా వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపింది. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడవచ్చని రా ముందస్తు నిఘా సమాచారం అందించినప్పటికీ, దానిని నిలువరించడంలో యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాగే దాడి జరిగిన వెంటనే ఢిల్లీ నుంచి ఎన్ఎస్జీ కమాండోలు ముంబైకి బయలుదేరే క్రమంలో, అప్పటి హోం మంత్రి బట్టలు మార్చుకోవడానికి సమయం తీసుకోవడం వల్ల విమానాశ్రయంలో కమాండోలు రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చిందన్న అంశం కూడా పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది.

దాడి అనంతరం పాకిస్థాన్‌పై ప్రతీకార సైనిక చర్య చేపట్టేందుకు సైన్యం సిద్ధమైనప్పటికీ నాటి ప్రభుత్వం దానిని నిలిపివేసిందన్న చర్చలు కూడా అప్పట్లో జోరుగా సాగాయి. రాజకీయ, సామాజిక, మీడియా కోణాల్లోనూ 26/11 దాడులు దేశంపై లోతైన ప్రభావాన్ని చూపాయి. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే కొన్ని రాజకీయ వర్గాలు, మీడియా వేదికలు హిందూ ఉగ్రవాదం అనే కథనాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాయి. అయితే కసబ్ సజీవంగా పట్టుబడటంతో ఆ వాదన వీగిపోయింది. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ 26/11 ఆర్ఎస్ఎస్ కీ సాజిష్ పేరుతో పుస్తకాన్ని విడుదల చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది. నాటి బలహీన నాయకత్వం, పాకిస్థాన్ అనుకూల వైఖరి వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని కొందరు నిఘా విభాగం మాజీ అధికారులు టెలివిజన్ చర్చల్లో ఆరోపణలు చేసినప్పటికీ, వాటికి సంబంధించి ఏ న్యాయస్థానంలోనూ అధికారిక నిర్ధారణ జరగలేదు. తీర ప్రాంత భద్రత, సంక్షోభ నిర్వహణ వైఫల్యాలను బహిర్గతం చేసిన ఈ ఘటన, ఆ తర్వాత దశాబ్దాల పాటు దేశ ఎన్నికల రాజకీయాల్లో జాతీయ భద్రత అనే అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చింది.
ఇది కూడా చదవండి: నిర్దోషిని, మైనర్ ని.. విచారణలో ముంబై ఉగ్రదాడుల దోషి కసబ్ దబాయింపు.!
ముంబై ఉగ్రదాడులకు పద్దెనిమిదేళ్లు పూర్తయినప్పటికీ, ఆ నాలుగు రోజుల పాటు జరిగిన పరిణామాలపై అనేక మౌలిక ప్రశ్నలకు నేటికీ అధికారిక స్థాయిలో పూర్తి సమాధానాలు లభించలేదు. కీలక అధికారుల పాకిస్థాన్ పర్యటన పొడిగింపు వెనుక ఉన్న అసలు కారణాలు, ఆ బృందాన్ని ముర్రీ హిల్ స్టేషన్‌కు తరలించడం వెనుక పాకిస్థాన్ అధికారులకు దాడుల గురించి ముందస్తు సమాచారం ఉందా లేదా అన్న కోణాలు ఇప్పటికీ పరిశోధకులను, భద్రతా నిపుణులను ఆలోచింపజేస్తున్నాయి.

భవిష్యత్తులోనైనా ఇలాంటి భద్రతా లోపాలు, సంక్షోభ సమయాల్లో నిర్ణయాధికార వ్యవస్థలో తలెత్తే అంతరాయాలపై మరింత పారదర్శకత రావాలని ప్రజలు, భద్రతా విశ్లేషకులు ఆశిస్తున్నారు. నిఘా సమాచార సమన్వయం, తీరప్రాంత రక్షణ, అత్యవసర స్పందన వ్యవస్థలను నిరంతరం బలోపేతం చేయడం ద్వారా మాత్రమే 26/11 అమరవీరులకు, తుకారాం ఓమ్బ్లే వంటి ధీరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించగలమనే అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.
మీకు నచ్చవచ్చు: హైదరాబాద్ లో పేలుళ్లు: బెదరింపు ఈ మెయిల్ తో పోలీసులు అలర్ట్.!
పుణే కేతన్ అగర్వాల్ హత్య కేసు...రంగంలోకి ‘26/11’ లాయర్
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Mumbai terror attacks, Facts, Madhukar Gupta, Pakistan Visit, Tukaram Omble, Sacrifice, Ajmal Kasab, TeluguOne]


