నిర్దోషిని, మైనర్ ని.. విచారణలో ముంబై ఉగ్రదాడుల దోషి కసబ్ దబాయింపు.!
Published on: Tue Sep 29, 2026 5:42PM

భారతదేశ చరిత్రలో ముంబై ఉగ్రదాడులు ఒక మహా విషాదం. ఈ దాడులకు పాల్పడిన ప్రధాన నిందితుడు అజ్మల్ కసబ్ కు ఈ ఘటన తరువాత దాదాపు నాలుగేళ్లకు ఉరి శిక్ష అమలైంది. ఆ కేసుకుసంబంధించిన విచారణ సందర్భంగా అజ్మల్ కసబ్ యాటిట్యూడ్, విశృంఖల ప్రవర్తన, విచారణ సందర్భంగా నిర్బయంగా ఆసుమంతైనా జంకూ గొంకూ లేకుండా చెప్పిన అబద్ధాలు, కస్టడీలో ఆహారం కోసం డిమాండ్ చేసిన తీరుకు సంబంధించిన వివరాలను ఆ కేసులో ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉజ్వల్ నికమ్ ఇటీవల వెల్లడించారు. ప్రముఖ టెలివిజన్ చానెల్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నాటి అనుభవాలను ఓ సారి నెమరు వేసుకున్నారు.
కౌన్ బనేగా కరోడ్ పతి హోస్ట్.. సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ నాటి విషయాలను చెప్పమని అడిగిన సందర్భంగ ఉజ్వల్ నికమ్ సంచలన విషయాలు వెల్లడించారు. హోర మారణహోమానికి పాల్పడిన కసబ్ లో కించిత్తు పశ్చాత్తాపం కానీ, భయం కానీ, బెరుకు కానీ కనిపించలేదని గుర్తు చేసుకున్న ఉజ్వల్ నికమ్.. విచారణ కోసం కసబ్ ను న్యాయస్థానంలోకి తీసుకు రాగానే అతడు తదేకంగా నేరుగా తన వైపే చూసే వాడనీ, ఒక విధంగా భయపెట్టాలన్న లక్ష్యం ఆ కళ్లల్లో కనిపించేదని చెప్పారు. అయితే తాను కూడా కసబ్ బాడీ లాంగ్వేజ్, మానసిక స్థితిని అంచనా వేయడానికి అతడిని నిశితంగా గమనించినట్లు చెప్పారు.

ఇక విచారణ సందర్భంగా కసబ్ తాను ముంబై రావడానికి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ను ప్రత్యక్షంగా చూసేందుకేనని చెప్పాడని ఉజ్వల్ నికమ్ చెప్పారు. ఆ సమయంలోకలగచేసుకున్న అమితాబ్ ఒక వేళ కసబ్ తనను కలవడానికి వచ్చి ఉంటే.. ప్రాణాలతో తిరిగి వెళ్లేవాడు కాదనీ, అక్కడికక్కడే తగిన శాస్తి జరిగేదనీ సరదాగా చమత్కరించారు. అమితాబ్ ను చూడడానికి వచ్చానన్న ఒక సంగతే కాదు.. కసబ్ విచారణ సందర్భంగా పలు వింత వింత, విడ్డూరమైన, అసందర్భ ప్రలాపనలు చేసినట్లు ఉజ్వల్ నికమ్ గుర్తు చేసుకున్నారు.
తాను మైనర్ ను అని నమ్మించడానికి కసబ్ చేయని ప్రయత్నిం లేదని చెప్పిన ఆయన.. కోర్టులో తనను జువైపైల్ జస్టిస్ చట్టం కింద విచారించాలని డిమాండ్ చేశారనీ, దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు అతనికి బోన్ డెన్సిటీ, సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించి వయస్సును నిర్ధారించారని గుర్తు చేసుకున్నారు.
అంతే కాకుండా తనకు ఉగ్రదాడులతో సంబంధం లేదని కూడా కసబ్ వాదించాడనీ, తనను పట్టుకున్నది రా అధికారులన్న అబద్ధాన్ని బలంగా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడన్న ఉజ్వల్ నికమ్.. అయితే, దర్యాప్తు బృందాలు సీసీటీవీ ఫుటేజ్‌లతో పాటు తిరుగులేని శాస్త్రీయ ఆధారాలను కోర్టు ముందుంచడంతో కసబ్ పప్పులుడకలేదని చెప్పారు. దాడులు జరిగి ముగిసినా, కసబ్‌కు ఉరిశిక్ష ఖరారు కావడానికి నాలుగేళ్ల సమయం పట్టడానికి కారణమేంటన్న అమితాబ్ ప్రశ్నకు ఉజ్వల్ నికమ్ భారత రాజ్యాంగం గొప్పతనమదేననంటూ.. రాజ్యాంగబద్ధమైన న్యాయ ప్రక్రియను పూర్తిగా అనుసరించి, నిందితుడికి తనను తాను సమర్థించుకునేందుకు తగిన అవకాశాలు, సమయం ఇవ్వడం చట్టపరమైన బాధ్యత, అందుకే శిక్ష ఖరారులో జాప్యం జరిగిందని వివరించారు.
విచారణ ఆరంభంలో తాను నిర్దోషినని వాదించిన కసబ్, , కస్టడీలో బిరియానీ కోసం గొడవ చేసేవాడనీ, అయితే.. చివరి దశలో మాత్రం తన తప్పును అంగీకరించి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని ఉజ్వల్ నికమ్ చెప్పారు. దేశభద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాదుల పట్ల న్యాయవ్యవస్థ పారదర్శకంగా, నిబద్ధతతో వ్యవహరిస్తుందనీ, నేరు రుజువైన తరువాత కఠిన శిక్ష తప్పదనీ కసబ్ ఉదంతం తేటతెల్లం చేస్తున్నది.
[Ajmal Kasab, Mumbay, Terror Attacks, Ujjwal Nikam, Mumbai attacks, Amitabh Bachchan, Kaun Banega Karodpati, Kasab Age , Special Public Prosecutor]


