అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్‌బై
posted on Aug 15, 2020 8:34PM

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ధోనీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇన్నాళ్లూ తనకు మద్దతిచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
యావత్ దేశం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకున్న రోజున.. ధోనీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ధోనీ రిటైర్మెంట్ ప్రకటనతో క్రికెట్ అభిమానులు షాకయ్యారు. దేశం తరపున మరింత కాలం క్రికెట్ ఆడతాడనే ఆశతో ఉన్న ధోనీ అభిమానులు ఈ ప్రకటనతో షాక్ కు గురవుతున్నారు.
భారత క్రికెట్‌కు ధోనీ రెండు దశాబ్దాల పాటు సేవలందించాడు. టీమిండియా తరపున మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. టీ20, వన్డే ప్రపంచకప్ లను అందించి అందరి ఆదరాభిమానాలను పొందాడు. 2019 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్స్ ధోనీ ఆడిన చివరి మ్యాచ్. ఆ మ్యాచ్ లో ఇండియా ఓటమిపాలై, టోర్నీ నుంచి తప్పుకుంది.