కాంగ్రెస్ గూటికి బోడ జనార్ధన్.. టీఆర్ఎస్ కు వరుస షాకులు

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బోడ జనార్థన్ కాంగ్రెస్ గూటికి చేరారు. దాదాపు వంద వాహనాల్లో తన అనుచరులతో కలిసి హైదరాబాద్ గాంధీభవన్ కు చేరుకున్న ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.

ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అలాగే అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మెట్ పల్లి జడ్పీటీసీ సభ్యుడు కాటిపెల్లి రాధ శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

తాజాగా బోడ జనార్థన్  కూడా కాంగ్రెస్ లో చేరడంతో టీఆర్ ఎస్ నుంచి వలసల వరదకు గేట్లు తెరిచినట్లైంది. కాంగ్రెస్ కండువా పుచ్చుకున్న సందర్భంగా బోడె జనార్ధన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు, ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేత రేవంత్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణలో అమరుల ఆకాంక్షల మేరకు పాలన సాగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.  తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. బాల్క సుమన్ వందల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు.