అశోకుడే కింగ్‌.. విజ‌యసాయీ ఎనీ డౌట్స్‌?

ఏపీలో పొలిటిక‌ల్‌గా మోస్ట్ ఓవ‌రాక్ష‌న్ ఫెలో ఎవ‌రంటే.. వెంట‌నే విజ‌య‌సాయిరెడ్డినే గుర్తొస్తార‌ని అంటారు. జ‌గ‌న్ త‌ర్వాత జ‌గ‌న్ అంత‌టి వాడిన‌నే ఫీలింగ్ ఆయ‌న‌ది. ఎంతైనా ఏ1 త‌ర్వాత ఏ2 క‌దా. ఆ మాత్రం బిల్డ‌ప్‌ ఉండాల్సిందేన‌నేది వైసీపీ నేత‌ల మాట‌. ఏపీలో ఎక్క‌డ ఏ విష‌యం వ‌చ్చినా.. త‌గుదున‌మ్మా అంటూ ఎగేసుకొస్తారు. అందులోనూ విశాఖ రిలేటెడ్ మేట‌ర్ అయితే మ‌రీను. ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్ అంతా త‌న ఇలాఖే అన్న‌ట్టు.. అన్నిట్లోనూ వేలు, కాలు పెడుతుంటారు. తాజాగా, విశాఖ ప‌రిధి దాటి వెళ్లి మ‌రీ.. విజ‌య‌న‌గ‌రం రాజా వారి మీద నోరు పారేసుకుంటున్నారు. సంచ‌యిత మాటున‌ అప్ప‌నంగా కాజేద్దామ‌నుకున్న‌ వేల కోట్ల ఖ‌రీదైన భూములకు.. అశోకుడి రాక‌తో అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని తెగ ఇదైపోతున్న‌ట్టున్నారు. అందుకే, కాలు కాలిన పిల్లిలా.. ఎగిరెగిగ‌రి ప‌డుతున్నారని అంటున్నారు. 

అశోక్ గ‌జ‌ప‌తిరాజు. విజ‌య‌న‌గ‌రం రాజా వారు. జ‌న్మ‌తః కోట‌కు రాజు. ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగానూ చేశారు. ఇన్ని ద‌శాబ్దాల రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఒక్క‌టంటే ఒక్క అవినీతి మ‌ర‌క కూడా లేని స‌చ్చీలుడు. సిగ‌రేట్స్ తాగే ఒకే ఒక్క బ్యాడ్ హాబిట్ మిన‌హా.. మ‌రే చెడు వాస‌నా అంట‌ని వైట్ కాల‌ర్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌. ఆయ‌న‌కేం ఖ‌ర్మ అవినీతికి పాల్ప‌డ‌టానికి.. అనుభ‌వించ‌డానికి అంతులేని రాజ‌వైభ‌వం.. క‌రిగిపోని సంప‌ద‌.. త‌ర‌గ‌ని ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ. అంతా ఆయ‌న సొంతం. మాన్సాస్ ట్ర‌స్ట్‌కు ఛైర్మ‌న్‌గా ఉంటూ.. ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా విస్త‌రించిన‌ విజ‌య‌న‌గ‌రం రాజుల సేవా కార్య‌క్ర‌మాల‌ను ఏ ఆటంకం లేకుండా చిర‌కాలం కొన‌సాగించ‌డ‌మే ఆయ‌న ల‌క్ష్యం.. సంక‌ల్పం. ఏళ్లుగా ఇదే బాధ్య‌త‌లో ఉన్నారు. ఇక‌పైనా ఉంటారు. అలాంటి ట‌వ‌ర్ ప‌ర్స‌నాలిటీ మీద‌.. రాజ‌కీయాల్లో మేరున‌గ ధీరుడిలాంటి వ్య‌క్తిత్వం మీద.. అవినీతి అబాండాలు వేయ‌డం వైసీపీ నాయ‌కుల‌కే చెల్లింది. అందుకే, విజ‌యసాయిరెడ్డి ఆరోప‌ణ‌ల‌ను చూసి జ‌నం న‌వ్వుకుంటున్నారు. ఉత్త‌రాంధ్ర వాసులైతే.. విజ‌య‌సాయికి శాప‌నార్థాలు పెడుతున్నారట‌. 

మాన్సాస్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో అంతులేని సంప‌ద ఉంది. నాలుగు జిల్లాల్లో విలువైన భూములున్నాయి. ఇన్నేళ్లూ అవి భ‌ద్రంగా ఉన్నాయి. కొత్త బిచ్చ‌గాళ్లు రాగానే వారి క‌న్ను.. మాన్సాస్ ఆస్తుల మీద ప‌డింద‌ని అంటున్నారు. ఆ భూముల‌కు సంబంధించిన రికార్డులు విజ‌య‌న‌గ‌రం కోట‌లో ఉన్న మాన్సాస్ కార్యాల‌యంలో, న‌మ్మ‌క‌మైన సిబ్బంది ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భ‌ద్రంగా ఉండ‌టం.. పాల‌కుల‌కు ఇబ్బందిగా మారింది. అందుకే, అశోకుడిని త‌ప్పించి.. కొత్త జీవోలు తీసుకొచ్చి.. దొడ్డిదారిన సంచ‌యిత‌ను మాన్సాస్ పీఠం మీద కూర్చోబెట్టార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆమె వ‌చ్చిందే ఆల‌స్యం.. మాన్సాస్ ట్ర‌స్ట్ కార్యాల‌యాన్ని విజ‌య‌న‌గ‌రం కోట నుంచి విశాఖ జిల్లాకు త‌ర‌లించ‌డం వెనుక ద‌స్తావేజుల‌ను కొట్టేసే కుట్ర దాగుంద‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఆ ద‌స్త్రాల దుమ్ముదులిపి.. మాన్సాస్ భూముల లెక్కాప‌త్రాలు, లోటుపాట్లను త‌మ‌కు అనుకూలంగా మార్చుకొనే ప‌నిలో ఉండ‌గా.. స‌డెన్‌గా హైకోర్టు తీర్పుతో ఆ గూడుపుఠానికి చెక్ ప‌డిన‌ట్టు అయింద‌ని అంటున్నారు. సంచ‌యిత పోయి.. అశోకుడు రావ‌డంతో.. కుట్ర‌దారులు, దోపిడీదారులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డార‌ని.. ఆ అస‌హ‌నంతోనే నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌నేది టీడీపీ వాద‌న‌.

న‌వ్విపోదురుగాక నాకేటి అన్న‌ట్టు.. అశోక్‌ గజపతిరాజు వందల ఎకరాలు దోచుకున్నార‌ని.. ఆయన అక్రమాలపై విచారణ జరుపుతున్నామ‌ని.. ఏదో ఒక రోజు అశోక్‌ జైలుకెళ్లే పరిస్థితి వస్తుందంటూ జోస్యం చెబుతున్నారు విజ‌య‌సాయి. అంతా ఏ1 జ‌గ‌న్‌రెడ్డి, ఏ2 విజ‌య‌సాయిలానే ఉంటార‌నుకుంటే ఎలా? అశోక్ చరిత్ర ఎలాంటిదో విజ‌య‌న‌గ‌రంలో ఎవ‌రిన‌డిగినా చెబుతారంటూ కౌంట‌ర్ ఇస్తున్నాయి టీడీపీ వ‌ర్గాలు. 
అశోక్‌గజపతిరాజు మాన్సాస్‌ ట్రస్టుకు మాత్రమే ఛైర్మన్‌.. విజయనగరం మొత్తానికి రాజు కాదు.. అంటూ విజ‌య‌సాయి ఇస్తున్న స్టేట్‌మెంట్స్ చూసి స్థానికులు న‌వ్వుకుంటున్నారు. ఎవ‌రు రాజులో.. ఎవ‌రు దోపిడీదారులో అంద‌రికీ తెలిసిందేనంటూ చ‌ర్చించుకుంటున్నారు. 

ఇక హైకోర్టు సింగిల్ జ‌డ్జి తీర్పు మీద అప్పీల్‌కు వెళ‌తామ‌నేది విజ‌యసాయి తాజా ప్ర‌క‌ట‌న‌. విజ‌య‌న‌గ‌రం రాజుల వీలునామాలో.. కుటుంబంలో మొద‌టి పురుష సంతానం మాన్సాస్ ట్ర‌స్టుకు ఛైర్మ‌న్‌గా ఉండాలంటూ సుస్ప‌ష్టంగా రాసుంది. తాజాగా హైకోర్టు సైతం ఆ ప్ర‌కార‌మే తీర్పు వెలువ‌రించింది. ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచ‌యిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్‌లను గుర్తిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోల‌ను, సంచ‌యిత నియామ‌క జీవోల‌ను.. మొత్తంగా నాలుగు జీవోలను (71, 72, 73, 74) హైకోర్టు రద్దు చేసింది. అయితే, సుప్రీం తీర్పు ప్రకారం స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం లేదంటూ కొత్త పాట అందుకుంది ప్ర‌భుత్వం. మహిళల పట్ల అశోక్‌గజపతిరాజు వివక్షత చూపించారంటూ ఆరోపిస్తోంది. అయితే, ఆ వీలునామా రాసింది అశోక్ కాద‌నే విష‌యం మ‌రిచి.. అది వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తున్న నిబంధ‌న అనేది మ‌రుగున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు విజ‌య‌సాయి. 

అప్పన్న భూముల కోసం వేసిన మాస్టర్ ప్లాన్ విఫలం కావడంవల్లే అశోక్ గజపతిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ మండిప‌డుతోంది. ప్రజల కోసం వేలకోట్ల ఆస్తులు త్యాగం చేసిన చరిత్ర అశోక్ గజపతిరాజుదని.. వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని జైలుకెళ్లిన చరిత్ర విజయసాయిదంటూ టీడీపీ చెడుగుడు ఆడుకుంటోంది. ఎవ‌రి ఆరోప‌ణ ఎలా ఉన్నా... మాన్సాస్ ఛైర్మ‌న్‌గా అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఆసీనుల‌వ‌డంపై స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య‌సాయిరెడ్డి చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను అస‌హ్యించుకుంటున్నారు. విజ‌య‌న‌గ‌రం వైభ‌వం, గ‌జ‌ప‌తుల కీర్తిప్ర‌తిష్ట‌త‌ల‌ గురించి విజ‌య‌సాయికేం తెలుస‌ని మండిప‌డుతున్నారు. అంతా, అశోకుడికే ప‌ట్టం క‌డుతున్నారు.