రేవంత్‌కే పీసీసీ పగ్గాలు! సీనియర్లకు రాహుల్ సిగ్నల్

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఆ క్రెడిట్ ను క్యాష్ చేసుకోవడంలో మాత్రం హ్యాండ్సప్ అంది. తెలంగాణలో హస్తం పార్టీ పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. పేరుకే ప్రతిపక్షం. ఉనికి కోసం తాపత్రయం. అంతలా దిగజారిపోయింది కాంగ్రెస్. పార్టీ ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పునరుజ్జీవనం పొందాలంటే సమర్థుడైన పీసీసీ అధ్యక్షుడు కావాలి. ఉత్తమ్ తర్వాత గట్టి పిండం కోసం వెతుకుతోంది అధిష్టానం. రేసులో మేమున్నామంటూ సీనియర్లంతా హస్తినలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం తెలంగాణలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే తురుపు ముక్క కోసం చూస్తున్నారు. రాహుల్ లిస్టులో అందరికన్నా ముందున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. 

సీఎం కేసీఆర్ పై గట్టిగా పోరాడగల సత్తా ఉన్న నేత రేవంత్ రెడ్డి. ఆయన మాట ఓ తూటా. గులాబీ బాస్ పై గురి పెట్టి వదిలే ఒక్కే డైలాగ్.. రాజకీయంగా డైనమైట్ లా పేలుతుంటుంది. ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను ఎఫ్పటికప్పుడూ కడిగేస్తూ, నిలదీసే నేత రేవంత్. రాహుల్ గాంధీకి కావలసింది అలాంటి నాయకుడే. అందుకే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిన ప్రచార కన్వినర్ గా నియమించి, ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ కూడా కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. కొడంగల్ లో ఓడిపోవడం రేవంత్ కాస్త తగ్గినట్టు కనిపించినా.. మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచి.. మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో హడలెత్తిస్తున్నారు. అందుకే, రాహుల్ గాంధీకి రేవంత్ పై ఎనలేని గురి. 

లేటెస్ట్ గా రాహుల్ మదిలోని మాట పరోక్షంగా బయటకి వచ్చింది. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి ఇటీవల రాహుల్‌ను కలిశారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పూర్తి స్థాయిలో పనిచేయడంలేదన్న అభిప్రాయాన్ని రాహల్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తునే పణంగా పెట్టేలా పనితీరు ఉండొద్దని రాహుల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సమయంలో మాధుయాష్కి టీపీసీసీ చీఫ్ ప్రస్తావన తెచ్చినప్పుడు రాహుల్ గతంలోకంటే భిన్నంగా స్పందించారట. టీపీసీసీ కూర్పు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని అలా అయితేనే తెలంగాణలో పార్టీ బలపడుతుందని మధుయాష్కి అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంలో తనకు ఒక ప్రణాళిక ఉందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. 

మధుయాష్కితో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విశ్లేషిస్తే.. ఆయన సీనియర్ల తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించడంలో సీనియర్లు సరిగ్గా పని చేయడం లేదనే అభిప్రాయం రాహుల్ లో కనిపించింది. పరోక్షంగా ఆలత రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని.. పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి పైనే ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే నిజమైతే.. రాహుల్ గాంధీని ఆకట్టుకున్న రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది.