రెండో డోస్ తీసుకున్న వ్యక్తికి కరోనా

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. జనవరి 16న టీకా పంపిణి ప్రారంభం కాగా... కొందరికి రెండో డోసు వేయడం కూడా పూర్తైంది. రెండో విడతలో భాగంగా మార్చి 1నుంచి 60 ఏండ్లకు పైబడిన వృద్దులతో పాటు 45 ఏండ్లు దాటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇస్తున్నారు. అయితే కరోనా టీకా సామర్ధ్యంపై అనుమానాలు మాత్రమే పోవడం లేదు. తాజాగా గుజరాత్ లో కరోనా టీకా రెండో డోస్ ను తీసుకున్న హెల్త్ ఆఫీసర్ కు  మహమ్మారి సోకడం కలకలం రేపింది. సదరు వ్యక్తి రెండో డోస్ తీసుకున్న రోజుల వ్యవధిలోనే వైరస్ బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు. 

గాంధీనగర్  దేగం తాలూకా ప్రాంతానికి చెందిన ఆరోగ్య అధికారి జనవరి 16న తొలి డోసు, ఫిబ్రవరి 15న రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇటీవలే ఆయనకు జ్వరం రావడంతో నమూనాలు సేకరించి పరీక్షించగా, వైరస్ పాజిటివ్ వచ్చిందని స్థానిక చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంహెచ్ సోలంకి వెల్లడించారు. కరోనా సోకినా ఆయనలో కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన్ను హోమ్ ఐసోలేషన్ లో ఉంచామని చెప్పారు. కరోనా సోకిన అధికారి ఆరోగ్యం మెరుగైన వెంటనే విధుల్లో చేరతానని తెలిపారని చీఫ్ హెల్త్ ఆఫీసర్ సోలంకి తెలిపారు.