చిరంజీవి కంటే సీఎం జగన్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు

కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం జగన్‌ కు వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కొన్ని కీలక సూచనలు చేశారు. మాస్కు పెట్టుకోవాలంటూ సినీనటుడు చిరంజీవి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయన కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్న సీఎం జగన్ ఓ మంచి కార్యక్రమం చేపడితే బాగుణ్ణు అని అభిప్రాయపడ్డారు. చిరంజీవి కంటే సీఎం జగన్ కే ఎక్కువమంది అభిమానులు ఉన్నారని, జగన్ కూడా వైరస్ పై పోరాటంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పేరుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. అలాగే ఇప్పుడు జగనన్న పేరుతో ఈ కరోనా వైరస్‌పై పోరాటం చేయాలన్నారు. దీనికి 'జగనన్న కరోనా కేర్' లేదా 'జగనన్న కరోనా వార్' అని పేరు పెడితే బాగుంటుందన్నారు. జగనన్న పేరు కచ్చితంగా ఉంటేనే ప్రజల్లో, అధికారుల్లో సీరియస్ నెస్ ఉంటుందని, అధికారులు చురుగ్గా పనిచేస్తారని పేర్కొన్నారు.

చెత్త వేసే మున్సిపాలిటి బండిలో కరోనా బాధితుడిని తీసుకు వెళ్లడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తన సొంతూళ్లో జరిగిన ఈ ఘటనపై సిగ్గుతో తలదించుకుంటున్నానని, తనను క్షమించాలని జనాన్ని కోరారు. సీఎం జగన్ వెయ్యికి పైగా అంబులెన్సులు ప్రారంభించారని, కానీ అవి అవసరానికి ఉపయోగపడలేదన్నారు. ప్రారంభించిన అంబులెన్సులు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళుతుందని భావిస్తున్నట్టు రఘురామకృష్ణరాజు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu