వర్షాకాల సమావేశాల్లో తెలుగు "వేడి"

దేశ రాజధానిలో వేడి పుట్టనుంది. గడచిన కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వర్షాలతో సతమతమైంది. అక్కడి ప్రజలు వర్షాలతో చలి కాచుకున్నారు. బుధవారం నుంచి వారే కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వేడి పుట్టించే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోసం లోక్‌సభ సమావేశాలను వేదికగా చేసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ అధికార భారతీయ జనతా పార్టీపై యుద్ధం ప్రకటించింది.

 

 

ఇందుకోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న పవన్ కల్యాణ‌ జనసేన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని నిలదీస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల పాలైన తమను ఆదుకుంటామని, ప్రత్యేక హోదాతో అక్కున చేర్చుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి ఇప్పుడు ఆ మాటే ఎత్తకపోవడం తెలుగు ప్రజలను వంచించడమే. గడచిన ఐదు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ప్రత్యేక హోదా చుట్టూనే తిరుగుతూండడం విశేషం. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు వారి మాయలో పడ్డారు. ప్రధానమంత్రిని నమ్మినందుకు నాలుగేళ్ళ తర్వాత పశ్చాత్తాపం పడుతున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అది వేరే సంగతి. నాలుగేళ్ల పాటు హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మంచిదని నమ్మబలికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్రం వంచించిందంటున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా అంశంపై నాలుగేళ్ల పాటు పార్లమెంటులో మాట్లాడని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఇప్పుడే ఈ అంశంపై పోరాటం చేయడం రాజకీయ ఎత్తుగడగానే పరిగణించాలి.

 

 

ఈ మొత్తం వ్యవహారంలో సమిధులైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. మూడు పార్టీల మూడు ముక్కలాటలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జోకర్‌లుగా మిగిలారు. లోక్‌సభ సభ్యత్వాలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు రాజనామా చేశారు. ఆ రాజీనామాలను స్పీకర్ అంగీకరించడం కూడా జరిగిపోయింది. దీంతో బుధవారం నుంచి జరిగే వర్షాకాల సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులే. బుధవారం నుంచి జరిగే లోక్‌సభ సమావేశాల్లో  ఎలాంటి వ్యూహం అనుసరించాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్నాళ్లూ బద్ద శత్రువుగా చూసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ముఖ్యమంత్రి అమరావతిలో భేటీ అయ్యారు. ఇది మంచి పరిణామం. కొంతకాలంగా ఉంవడల్లి అరుణ్ కుమార్ ప్రత్యేక హోదాపై పలు సూచనలు చేస్తున్నారు. ఇంతకు ముందు పత్రికల ద్వారా సూచనలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికే నేరుగా చెప్పారు. 

 

 

ఈ సూచనల్లో ప్రధానమైనది ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలే తెలుగు వారికి ఆయుధాలని చెప్పడం ప్రధానం. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభ సమావేశాల్లో మన వాదనను వినిపించ వచ్చునన్నది ఉండవల్లి సూచన. అయితే దీనికి మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి మద్దతు రాకపోవచ్చు. వారు వ్యతిరేకించకపోయినా సభలో ఏం మాట్లాడకుండా ఉంటే సరిపోతుందన్నది అధికార తెలుగుదేశం ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం లోక్‌సభ ప్రజాప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ సభ్యుల దగ్గరికి పంపించారు చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంటు సభ్యులు కె, కేశవరావు, జితేందర్ రెడ్డిలను  దగ్గరకు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, కొనకళ్ల కలిసారు. తెలుగు వారి ఇబ్బందులపై కలసి పోరాడాలన్న వారి వినతికి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సానుకూల స్పందన రావడం ముదావహం. మొత్తానికి బుధవారం నుంచి రాజధాని ఢిల్లీలో  తెలుగు వారి వాడీ, వేడీ ఎలా ఉంటుందో చూడాలి...!?