మంచు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష

 

సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు తీర్పునిచ్చింది. చెక్‌బౌన్స్‌ కేసులో మోహన్‌బాబుకు ఈ శిక్ష పడింది. 2010లో చెక్‌బౌన్స్‌ కేసు వ్యవహారంలో దర్శకుడు వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు రూ.10వేల జరిమానా, ఏ2గా ఉన్న మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41.75లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ‘సలీం’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మోహన్‌బాబు రూ.40.50లక్షల చెక్కును దర్శకుడికి అందించారు. అయితే, ఆ చెక్‌ చెల్లకపోవడంతో వైవీఎస్‌ చౌదరి 2010లో కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఒక వేళ మోహన్‌బాబు రూ.41.75లక్షలు చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఇంకా రియాక్ట్ అవ్వలేదు.