ప్రధాని మోడీతో తమిళిసై భేటీ.. కారణమదేనా?

పెళ్లికి వ‌చ్చిన‌వారంతా స‌ర‌దాగానే గ‌డిపి వెళిపోతారు. మంచిమాట‌లు, మంచి అభిప్రాయాల‌తో మంచి జ్ఞాప‌కాల‌నూ వెంట తీసికెళ‌తారు. నిన్న మొన్న‌టి బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చి కేసీఆర్ ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి ఇచ్చిన ఆర్ధిక స‌హ‌కారం గురించి ఎంతో  చెప్పారు. టిఆర్ ఎస్ ప్రభుత్వానికి కేంద్రం సాయం చేయ‌డం లేద‌న్న‌ది శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని  ఆయ‌న మాట‌ల్లోనే ప్ర‌ధాని తెలంగాణా ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేశారు. అంతవ‌ర‌కూ బాగానే వుంది. కానీ వెళుతూ ఓ క్ష‌ణం    గ‌వర్న ర్‌తో మోడీ భేటీయే   గులాబి దండులో ఆందోళ‌న నింపింది. పోతూ పోతూఈ  పెద్దాయ‌న గవర్నర్ తో ఏం మాట్లాడి వుంటారు, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తమ ప్రభుత్వంపై,  ముఖ్యమంత్రిపై ఏం ఫిర్యాదులు చేసి ఉంటారు అన్న  చ‌ర్చ‌లు ఆరంభ‌మ‌య్యాయి.  అస‌లే ఇటివ‌ల కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ఏది ప‌డినా భ‌గ్గుమ‌ంటున్న‌ది. మ‌రి ప్ర‌ధాని ఏకంగా ఆమెతో చర్చకు సమయం కేటాయించారంటే ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే అంశమే ఆమె నుంచి ఆయనకు చేరి ఉంటుందని గులాబి దళం ఆందోళన పడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ పరేడ్ గ్రౌండ్స్ లో సభ అనంతరం రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్కడే బస చేశారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ రాజ్ భవన్ లో ఆయనతో గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. ఇరువురూ దాదాపు 40 నిముషాల సేపు భేటీ అయ్యారు. ఇది పూర్తిగా ముఖాముఖీ భేటీ. అధికారులు కానీ, పార్టీ నేతలు కానీ లేరు. ఇక్కడే వారిరువురి మధ్యా భేటీలో చర్చకు వచ్చిన అంశాలేమిటన్నదానిపై రాజకీయ వర్గాలలో మరీ ముఖ్యంగా గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వారిరువురి భేటీలో పూర్తిగా తెలంగాణ అంశాలే చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా కేసీఆర్ పాలన, రాష్ట్రంలో శాంతి భద్రతలు, కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై కొన్ని నివేదకలను మోడీకి అందించినట్లు చెబుతున్నారు. దీంతో వీరురువురి మధ్యా జరిగిన చర్చలపై తెరాసలో ఉత్కంఠ పీక్స్ కు వెళ్లింది. ఇటీవలి కాలంలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ బాగా పెరిగిన నేపథ్యంలో మోడీతో భేటీలో గవర్నర్ తమిళసై కేసీఆర్  సర్కార్ పై మోడీకి ఫిర్యాదు చేయడమే కాకుండా.. కీలక అంశాలపై నివేదికలు కూడా సమర్పించి ఉంటారన్న భావన అయితే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది.  

మామూలుగా అయితే  ప్రధాని, గవర్నర్ భేటీకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత ఉండదు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై- మోడీ భేటీ మాత్రం ఎనలేని రాజకీయ ప్రధాన్యత  సంతరించుకుంది. అందుకు కారణం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితే కాకుండా.. గవర్నర్- ప్రభుత్వం మధ్య ఉన్న రిఫ్ట్ కూడా ఒక కారణం. గతంలో తమిళిసై ఢిల్లీ వెళ్లి మరీ కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ప్రధాని, హెంమంత్రికి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. గవర్నర్ పర్యటనలలో మంత్రులు, అధికారులూ ప్రొటోకాల్ పాటించకపోవడం దగ్గర నుంచి.. అడిగిన సమాచారం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదన్న వరకూ తమిళసై కేంద్రానికి నివేదించారు.

ఇక ప్రస్తుతం కేంద్రం, తెరాస సర్కార్ మధ్య రాజకీయం వేడెక్కిన తరుణంలో తమిళిసైతో మోడీ భేటీకి ప్రాధాన్యత పెరిగింది.  జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన కేసీఆర్ ఇటీవలి  ప్రయత్నాలు విఫలమైనా   జాతీయ ప్రత్యామ్నాయ ప్రణాళిక ఆలోచనలతో మోడీపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో.. మోడీ ప్రత్యేకంగా గవర్నర్ తమిళపైతో  40 నిముషాల పాటు ముఖాముఖి చర్చలు జరపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళసై చెప్పిన అంశాలు, అందించిన నివేదికలను ఆయన కూలంకషంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా తమిళిసైతో మోడీ భేటీలో ఆమె కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి అవసరమై సమాచారాన్ని అందించి ఉంటారని రాజకీయవర్గాలలో చర్చ సాగుతోంది.