బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

 

బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉన్నది. మనోజ్‌రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్‌ రెడ్డి నాలుగు రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో ఆయనకు చుక్కెదురయింది. శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.