పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలం : చంద్రబాబు
posted on May 27, 2025 3:14PM

తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ కడప మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడపలో మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పార్టీ కోసం నిస్వార్థంగా, అంకితభావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి వేధించినా ఎత్తిన జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు. టీడీపీ కార్యకర్తలు అందరికీ ఈ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పదింటికి 7 స్థానాలు గెలిచాం. ఈసారి ఇంకొంచెం కష్టపడి పదికి పది గెలవాలని చంద్రబాబు క్యాడర్‌కి పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతం స్ట్రైక్‌రేట్ సాధించి అద్భుత విజయం సాధించామని తెలిపారు.
‘‘నేనో సైనికుడిని.. నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే.. మీరు నేను కలిస్తే మనకు ఆకాశమే హద్దు. మనం ఏ పనైనా చేయగలం. దీనికి మీరు సిద్ధమేనా’’ అని కార్యకర్తలను చంద్రబాబు ప్రశ్నించారు. నీతి నిజాయితీ రాజకీయాలు, విజన్ తో ముందుకు వెళ్లే రాజకీయాలకు టీడీపీ బ్రాండ్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అవినీతిపై పోరాడామని, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రహిత పాలన అందించామని వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా కూడా టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు, చెరిపేస్తే చెరిగేది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్లకు.. వాళ్ల పనే అయిపోయింది. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కొన్నాం. పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది.
జగన్ విధ్వంస పాలనతో ఏపీన్ని సర్వ నాశనం చేసింది. దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారు. వేటాడారు, వెంటాడారు.. అక్రమ కేసులు పెట్టారు. కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా. మన పసుపు సింహం, కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. డిజిటల్ కరెన్సీ వచ్చా నోట్లు అవసరం లేదని పేర్కొన్నారు. దీని వల్ల అవినీతి తగ్గిపోతుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం డీమానిటైజేషన్ రద్దు చేసే సమయంలో తాను ప్రధాని మోదీకి ఒక సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ టైమ్ లో డిజిటల్ కరెన్సీపై తాను ఒక రిపోర్ట్ ని ప్రధానికి ఇచ్చానన్నారు.
500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసి, కొత్తగా 2వేల నోట్లు తీసుకొచ్చిన సమయంలో తాను ఓ కీలక సూచన చేసినట్టు చెప్పారు. 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లతోపాటు కొత్తగా తెచ్చిన 2వేల నోట్లు కూడా రద్దు చేయాలని, అన్ని పెద్ద నోట్లు రద్దు చేసేయాలని తాను ప్రధానికి సూచించానన్నారు. అలా నోట్లు రద్దు చేస్తే డిజిటల్ కరెన్సీతో అవినీతికి చెక్ పెట్టినట్టవుతుందని చెప్పారు చంద్రబాబు.అవినీతి పూర్తిగా తగ్గించేందుకే ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్క వాట్సప్ మెసేజ్ తో పనిజరుగుతోందని, అధికారులు కూడా పారదర్శకంగా రిపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక విధానంలో కూడా పారదర్శకత అవసరం అన్నారు.