కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్పత్రి పాలు
posted on Dec 13, 2023 10:12AM
తెలంగాణలో గొంతు ఇన్ ఫెక్షన్ సమస్యలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ప్రచార సమయం నుంచీ ఆయన గొంతునొప్పితో బాధపడుతున్నారు. అది మరింత తీవ్రం కావడంతో హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ప్రచారంలో విరామం లేకుండా పాల్గొని ప్రసంగించడంతో ఆయన గొంతుకు ఇన్ఫెక్షన్ అయింది. ప్రస్తుతం చలి వాతావరణం పెరగడం, ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో అది మరింత ఎక్కువైంది. ఆయనను పరీక్షించిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ స్వల్పంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.నిన్న ఢిల్లీ వెళ్లిన వెంకట్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణ చేపట్టాలని కోరుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌ను కలిసి కోరారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత యశోద ఆసుపత్రిలో చేరారు.