ట్రబుల్ షూటర్ 2 .0

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న అధికార తెరాస పార్టీ, పార్టీ అభ్యర్ధి మాజీ ప్రధాన మంత్రి పీవీ కుమార్తె, ఎస్ వాణి దేవి గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా, వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్  మరోసారి ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దించారు. గత కొంత కాలంగా, సిద్దిపేటకే పరిమితమైన హరీష్ రావు, రంగారెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వర్గ విభేదాలను పక్కనపెట్టి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేతలందరూ ఒక తాటిపైకి వచ్చి పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జి నియమిస్తూ పోలింగ్ తేదీ వరకు ఒక్కో ఓటర్ ను మూడు నుంచి ఐదు సార్లు కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా తెరాస అభ్యర్థికి ఎందుకు ఓటేయాలో ప్రజలకు వివరించాలని, ఇదుకు అవసరమైన ప్రచార సామగ్రిని త్వరలో అందజేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ తదితరాలపై ఓటర్లకు అవగాహన కల్పించి వారిని తెరాస అభ్యర్థికి ఓటు వేసేలా కృషిచేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కారు .. కమల్ మధ్యనే పోటీ ఉంటుందని, ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల పార్లమెంట్ రంజిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జిల్లా ఎన్నికల ఇంచార్జ్ నాగేంద్ర గౌడ్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu