జగన్ తో షర్మిలకు ఆస్తి గొడవలు!
posted on Mar 3, 2021 4:46PM
తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. దూకుడు పెంచారు. లోటస్ పాండ్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిలకు మద్దతు కూడా రోజురోజుకు పెరుగుతోంది. అయితే మద్దతు పాటు షర్మిల పార్టీపై కొత్త విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. షర్మిల పార్టీ పెడుతున్నారన్న వార్తలపై వైఎస్సార్ కు సన్నిహితంగా మెలిగిన, మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబంలో కలహాలతోనే షర్మిల పార్టీ పెడుతున్నారని చెప్పారు. షర్మిలకు జగన్ లోక్‌సభ సీటు, రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నారు. జగన్ కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయన్నారు గోనే ప్రకాశ్ రావు.
గతంలో చిరంజీవి పార్టీ వల్ల అమాయకులు బలైయ్యారని, చాలా మంది భూములు అమ్మి.. స్వరం కోల్పోయారన్నారు గోనే ప్రకాశ్ రావు. ఇప్పుడు షర్మిల పార్టీ కూడా అదే తరహాలో నడుస్తోందన్నారు. ఇలా పార్టీలు పెట్టి ఇతరులను ముంచొద్దన్నారు. వైఎస్ విజయలక్ష్మి ఆశీర్వాదం షర్మిలకు ఉందని వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణ నేతలందరికి విజయమ్మ ఫోన్ చేస్తున్నారని తెలిపారు, తెలంగాణలో పార్టీ పెట్టి రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టను దిగదార్చుకోవొద్దని వైఎస్ షర్మిలకు హితవు పలికారు గోనే ప్రకాశ్ రావు.