ఇచ్చిన హామీని మరచిన జగన్... రోడ్డెక్కిన మహిళలు

 

జగన్ మాట ఇస్తే తప్పరని సామాన్యులు, అలాగే వైసిపి నేతలు చెప్పుకుంటారు. ఐతే గతంలో పాదయాత్ర చేస్తున్నపుడు జగన్ నవరత్నాలతో పాటుగా అనేక హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి మధ్యాహ్న భోజన పథకం. ఐతే ఏపీలో కొత్త  ప్ర‌భుత్వం వచ్చిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్నాహ్న భోజ‌న కార్య‌క్ర‌మం అమ‌లు చేస్తున్న వారి స్థానంలో కొత్త గా అక్ష‌య పాత్ర ద్వారా ఈ ప‌ధ‌కాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా ఈ పథకం అమలు లో భాగస్వాములైన మహిళా కార్మికులు తమకు ఇచ్చే గౌరవ వేతనం పెంచటం మాట అటుంచి నాలుగు నెలలుగా తమకు రావలసిన గౌరవ వేతనాన్ని ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు విజయవాడ లో ఆందోళన చేసి ఆ తరువాత చలో అసెంబ్లీకి బయలుదేరారు. దీనితో పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా మహిళా కార్మికులు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ విషయంలో నడుస్తోందని ఆరోపించారు. నాలుగు నెలల వేతనాన్ని ఇవ్వకపోగా మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర అనే  స్వచ్చంద సంస్థకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం పై ముఖ్య‌మంత్రి జగన్ సానుకూలంగా స్పందించ‌కుంటే ఆందోళ‌న త‌ప్ప‌ద‌న్నారు. పిల్లలు అక్షయ పాత్ర ద్వారా అందిస్తున్న భోజనాన్ని తినటం లేదని ఈ సంఘాల నేత‌లు వివ‌రించారు. విద్యార్థుల అలవాట్లకు అనుగుణంగా అప్పటికప్పుడు వండి పెట్టే విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలని లేదంటే ఉధ్యమాన్ని మరింత తివ్రతరం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.