మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకుంటాం: ఎల్ అండ్ టీ లేఖ

 

హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ సంస్థ ఛైర్మన్ వీబీ గాడ్గిల్ తెలంగాణ ప్రభుత్వానికి 20 పేజీల సుదీర్ఘ లేఖ రాసింది. ఆ లేఖలో మెట్రో రైలు ప్రాజెక్టు కారణంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది. మెట్రో రైలు ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ వేగం రాష్ట్ర విభజన తర్వాత తగ్గిపోయింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్న సమస్యలతోపాటు రాష్ట్ర విభజన కారణంగా మారిన పరిస్థితులు కూడా ఎల్ అండ్ టీ సంస్థను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి ప్రిపేర్ చేశాయి. మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఆ సంస్థ విమర్శించింది. ఈ ప్రాజెక్టు నుంచి మేం తప్పుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా మా సంస్థకు నష్టం రాబోతోంది. అందువల్ల మా ఖర్చులు మాకు ఇచ్చేసి మెట్రో రైలును మీరే నిర్మించుకోండి అని ఎల్ అండ్ టి ఆ లేఖలో స్పష్టంగా చెప్పింది.