పాపం... తెలంగాణ కాంగ్రెస్...

 

పాపం.. తెలంగాణ కాంగ్రెస్ ఎలా వుండేది ఎలా అయిపోయిందో! ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తుంటే జాలిపడటం మినహా ఏమీ చేయలేని పరిస్థితులున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేస్తారని ఆశించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి సంవత్సరం దాటినా టీ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అసలు ఎందుకు ఇలా జరిగిందో టీ కాంగ్రెస్  నాయకులకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ ద్వారా బోలెడన్ని పదవులు, ప్రయోజనాలు పొందిన నాయకులు పార్టీ నుంచి మెల్లగా జారుకుంటున్న సమస్య ఒకవైపు వేధిస్తుంటే, పార్టీని సమర్థంగా నడిపే నాయకత్వం లేకపోవడం కూడా తెలంగాణ కాంగ్రెస్‌కి మరో పెద్ద సమస్యగా మారింది. అందువల్లే తెలంగాణ కాంగ్రెస్ ఎందుకూ పనికిరాని విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ మరింత పతనం అవుతోంది.

షాక్‌ల మీద షాక్‌ల కారణంగా టీ కాంగ్రెస్ నాయకుల మెదళ్ళు మొద్దుబారిపోయాయన్న విషయం వారి ఆలోచనా విధానం చూస్తే అర్థమవుతోంది. వారి పసలేని ఆలోచనల నుంచి ఉద్భవించిన తాజా గొప్ప ఉపాయం... వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ని పోటీకి నిలపాలని భావిస్తూ వుండటం. పార్లమెంటు తలుపులు మూసేసి, టీవీ ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి తెలంగాణ బిల్లు ఆమోదించిన తీరు తెలంగాణ ప్రజలకు ఎంతో నచ్చిందట, అందుకే ఆమె వరంగల్‌లో పోటీ చేసే కళ్ళు మూసుకుని ఓట్లు వేసేస్తారట. అంతేకాకుండా ప్రముఖ దళిత నాయకుడు జగ్జీవన్‌రామ్ కుమార్తె కావడం వల్ల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దళితులందరూ మీరాకుమార్‌కి ఓట్లు వేసేస్తారట. తెలంగాణ కాంగ్రెస్ మీద టన్నుల కొద్దీ జాలి పడటానికి ఈ ఆలోచనా ధోరణిని గమనిస్తే సరిపోతుంది కదా.

తన సొంత రాష్ట్రంలో, తన సొంత నియోజకవర్గంలో గెలవలేని మీరాకుమార్‌ని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని అనుకోవడం ఒక పెద్ద తప్పు. ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల్ని దారుణంగా అవమానించడమే అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలు అభ్యర్థులే లేనట్టు బయటి రాష్ట్రం నుంచి అభ్యర్థిని తీసుకుని వచ్చి నిలబెట్టటమేంటి? తెలంగాణ ఆత్మగౌరవం అంటూ మొన్నటి వరకూ రంకెలు వేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎక్కడి నుంచో మీరాకుమార్ని తీసుకొచ్చి వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని అనుకోవడం ఏమిటి? ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని దళిత నాయకులను అవమానించినట్టు కాదా? ఇప్పటికైనా టీ కాంగ్రెస్ తన ఆలోచనా ధోరణిని మార్చుకుంటే మంచిది.. లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి పట్టిన గతే తెలంగాణలోనూ పట్టడం ఖాయం.