మీడియా స్వీయ ఆంక్షలపై బిగ్‌బీ హాపీ
posted on Nov 12, 2011 8:02AM
ముం
బై: బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రసవానికి సంబంధించిన వార్తల ప్రసారంపై మీడియా స్వయంగా ఆంక్షల్ని విధించుకోవటం తన హృదయాన్ని తాకిందని ఆమె మామ అమితాబ్ బచ్చన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఐశ్వర్య కాన్పునకు సంబంధించిన వార్తల కవరేజి గురించి అనుసరించాల్సిన నియమాల్ని, మార్గదర్శకాల్ని తెలియజేస్తూ పది పాయింట్లతో కూడిన ఓ జాబితాను బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ జారీ చేసింది. ఐశ్వర్య ప్రసవం గురించి అధికారికంగా సమాచారం అందిన తర్వాతనే వార్తల్ని ప్రసారం చేయాలని, ఊహాగాన వార్తలు, బ్రేకింగ్ న్యూస్ హంగామా ఉండరాదని అందులో పేర్కొన్నారు. ఆస్పత్రి వెలుపల, పరిసరాల్లో బ్రాడ్ కాస్టింగ్ వ్యాన్లను ఉంచరాదని బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ సూచించింది. బచ్చన్ కుటుంబం ఆహ్వానం మేరకే ఫొటోలు తీయడానికి వెళ్లాలని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాలపట్ల బిగ్ బీ హర్షం వ్యక్తం చేశారు.