తుమ్మలతో టీడీపీ ఎమ్మెల్యే భేటీ..

 

మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు భేటీ అయ్యారు. మెచ్చా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్యలు గెలుపొందారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. దీనిపై సండ్ర కొంత సానుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ.. మెచ్చా మాత్రం ఈ వార్తను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు. చంద్రబాబు ని సైతం కలిసి క్లారిటీ ఇచ్చేసారు. 

తెలంగాణలో టీడీపీ ఉనికిని కనుమరుగు చేయాలని కంకణం కట్టుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సండ్ర వెంకట వీరయ్య,మెచ్చా నాగేశ్వరరావులను పార్టీలోకి తీసుకొచ్చే భాద్యతను తుమ్మలకి అప్పగించారు. అయితే వీరిద్దరూ స్పందించకపోవడంతో కేసీఆర్ నేరుగా సండ్ర వెంకట వీరయ్యకు ఫోన్ చేసి మంత్రి పదవి ఇస్తా పార్టీలోకి రావాలంటూ కోరినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై సండ్ర వెంకట వీరయ్య మాత్రం స్పందించలేదు. కానీ మెచ్చా నాగేశ్వరరావు మాత్రం ఈ వార్తలను ఖండించారు. కాగా తాజాగా మెచ్చా,తుమ్మలతో భేటీ అవటంతో రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకుంది. మెచ్చా  పార్టీ మారిపోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే భేటీపై స్పందించిన మెచ్చా..పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని ఖండించారు. తన రాజకీయ గురువు, తన ఎదుగుదలకు కారణమైన తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ప్రకటన విడుదల చేశారు.