మానని గాయానికి రెండేళ్లు..

మాసాయిపేట రైలు దుర్ఘటన..తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశాన్ని శోకసంద్రంలోకి నెట్టిన ఒక విషాదగాధ. నాలుగు గ్రామాల్లో..18 కుటుంబాల్లో ఆరనిచిచ్చును రగిల్చిన నెత్తుటి సంతకం. పొద్దున్నే లేచి తయారై లంచ్ బాక్సులు పెట్టుకుని చిట్టి బ్యాగులు వేసుకుని అమ్మానాన్నలకు నవ్వుతూ టాటా చెబుతూ స్కూలు బస్సెక్కిన చిన్నారులకు కాని..వారి తల్లిదండ్రులకు కాని తెలియదు కాసేపట్లో మృత్యుదేవత పంజా విసరబోతోందని. 2014 జూలై 24న మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మాసాయిపేట రైల్వేక్రాస్ వద్ద ఉదయం పదిగంటల సమయం..ట్రాక్ దాటుతున్న స్కూలుబస్సు హఠాత్తుగా ఆగిపోయింది..ఎందుకు ఆగిందో ఎవరికీ తెలియదు..ఇంతలో అటు నుంచి వచ్చిన రైలు స్కూలు బస్సును ఢీకొని కిలోమీటరు దూరం లాక్కెళ్లింది. డ్రైవరు, క్లీనరు సహా 16 మంది అభం శుభం తెలియని చిన్నారులు మృత్యుశకటానికి బలైయ్యారు. ఇందులో 13 మంది చిన్నారులు సంఘటనా స్థలంలోనే మరణించగా..ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా, ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు.

 

చూస్తుండగానే రెండేళ్లు పూర్తయింది..అయినా కంటివెలుగులను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు మాత్రం ఆ ఘటన ఇంకా కళ్లేదుటే మెదులుతోంది. గాయాలతో బయటపడి తమ ముందే తిరుగుతున్న పిల్లలను చూసి చనిపోయిన తమ పిల్లలను గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. స్కూలుకెళ్లే ప్రతి బిడ్డను చూసినప్పుడల్లా తమ బిడ్డ ఉంటే ఇలాగే బడికి వెళ్లేవాడేనేమోనని లోలోపల కుమిలిపోతున్నారు. ఇది గాయానికి ఒకవైపే..అదే ప్రమాదంలో మరో 18 మంది తీవ్రగాయాలతో ప్రభుత్వ ప్రత్యేక శ్రద్దతో ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కొందరికి జ్ఞాపకశక్తి మందగించింది. మరి కొందరిలో చేతులు, కాళ్లు వణుకుతుండటంతో బతికుండగానే నరకం చూస్తున్నారు. 

 

కారణం ఎవరు..?


దశాబ్దాలుగా ప్రజలు మొత్తుకుంటున్నా రైల్వేశాఖ మాసాయిపేట లెవల్ క్రాస్ వద్ద గేటు ఏర్పాటు చేయలేదు..కాపలాదారులను నియమించలేదు. కాపలాలేని లెవల్ క్రాసింగ్స్ వద్ద వాహనాల డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ ఆ బస్సు డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తతతో వ్యవహరించలేదు. దానికి తోడు డ్రైవర్ సెల్‌ఫోనులో మాట్లాడుతుండటం వల్లే అతడు రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులుచెబుతున్నారు. చిట్టచివరి నిమిషంలో వెనుక నుంచి పిల్లలంతా రైలు..రైలు అని అరవడంతో ఒక్కసారిగా కంగారుపడి ఆలస్యంగా బ్రేకులు వేశాడని, కానీ..దాని వల్ల బస్సు ఆగకపోగా రైలు పట్టాల మీదుగా జారిపోవడంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొందని తేల్చారు.

 

చెల్లెలు చనిపోతున్నా..తోటివారి ప్రాణాలను కాపాడి..
ఈ ప్రమాదం ఒక సాహసబాలికను వెలుగులోకి తీసుకువచ్చింది. ఒకర్నొకరు కాపడుకోలేని అచేతనస్థితి..హాహాకారాలు తప్ప..ఆపన్న హస్తాలు కనిపించని ఆపత్కాలంలో..తనను..తన తమ్ముడు, చెల్లి ప్రాణాలను లెక్కచేయకుండా చిన్ని చేతితో తోటివారి ప్రాణాలను కాపాడిన సాహస బాలిక రుచిత. రైలు కూతపెట్టుకుంటూ వస్తోందని గమనించిన రుచిత, డ్రైవర్ అంకుల్ రైలొస్తుందని అరిచింది..అయితే బస్సు ఎంతకూ స్టాట్ కాకపోవడం, రైలు దగ్గరదాకా వస్తుండటంతో రుచిత మదిలో ఆలోచన తట్టింది. అంతే సద్భావన్, మహిపాల్‌రెడ్డి అనే పిల్లలను వెంటనే కిటికీల్లోంచి కిందకు తోసేసి తర్వాత తానూ కిందకు దూకేసింది. అయితే ఆ ప్రయత్నంలో చెల్లెలిని కాపాడలేకపోవడంతో ఆమె చనిపోయింది. రుచిత సాహసాన్ని గుర్తించిన భారతప్రభుత్వం పాపను సాహస బాలికగా ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రుచిత అవార్డును అందుకుంది

 

ప్రతి ప్రమాదం మిగిల్చే విషాద ఛాయలు ఎంతో గాఢంగా ఉంటాయి. ప్రభుత్వాలు ఎంత పరిహారం ఇచ్చినా కానరాని లోకాలకు తరలిపోయిన ఆ చిన్నారులను తీసుకురాలేవు. వారి గుర్తులు తల్లిదండ్రులను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి దుర్గతి ఏ తల్లిదండ్రులకు పట్టకూడదని..ఆ చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తోంది..మీ తెలుగువన్