న్యాయమూర్తుల వివాదానికి తీర్పెవరు చెపుతారు?

 

సుప్రీం కోర్టు మాజీ జడ్జిగా చేసిప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా వ్యవహరిస్తున్న మార్కండేయ కట్జూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు సైతం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నారని, పైగా వారి పదవీ కాలం పొడిగించమని ప్రభుత్వానికి లేఖలు వ్రాస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన లహోటీకి ఇదే విషయమై కొన్ని ప్రశ్నలు సంధించి వాటికి సమాధానాలు చెప్పగలరా అని సవాలు కూడా విసిరారు. ఆ ప్రశ్నలు:  


1.     నేను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నపుడు అక్కడ అదనపు జడ్జీగా చేస్తున్న ఒక వ్యక్తిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నట్లు నేను మీకు లేఖ వ్రాయడం నిజమా కాదా? ఆ తరువాత నేను డిల్లీకి వచ్చి మిమ్మల్ని (లాహోటీ) కలిసినప్పుడు సదరు జడ్జీపై ఇంటలిజన్స్ బ్యూరో చేత రహస్యంగా దర్యాప్తు చేయమని కోరడం నిజమా కాదా?

 

2.      అప్పుడు మీరు (లాహోటీ) ఆయనపై ఇంటలిజన్స్ బ్యూరో చేత రహస్యంగా దర్యాప్తుకు ఆదేశించిన మాట నిజమా కాదా?

 

3.     ఇంటలిజన్స్ బ్యూరో దర్యాప్తు చేసి, సదరు జడ్జి అవినీతి పనులకు పాల్పడ్డారని దృవీకరించిన తరువాత, సుప్రీంకోర్టు కొలిజియం సభ్యుల సలహా ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అదనపుజడ్జి పదవికాలం మరో రెండేళ్ళు పొడిగించవద్దని మీరు ప్రభుత్వానికి లేఖ వ్రాసిన మాట నిజమా కాదా?

 

4.     ఆ తరువాత మీరు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, సుప్రీంకోర్టు కొలిజియం సభ్యుల అభ్యంతరాలను లెక్కచేయకుండా, వారికి తెలియజేయకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తినే మద్రాసు హైకోర్టు అదనపు జడ్జీగా మరో ఏడాది పాటు పదవిలో కొనసాగించమని మీరు (లహోటీ) ప్రభుత్వానికి లేఖ వ్రాసిన మాట నిజమా కాదా?

ఈ ప్రశ్నలను గమనిస్తే న్యాయవ్యవస్థ కూడా రాజకీయ ఒత్తిళ్లకు అతీతం కాదని స్పష్టమవుతోంది. కానీ కట్జూ చేస్తున్న ఈ ఆరోపణలకు మన న్యాయవ్యవస్థ ఏమని చెపుతుందో వేచి చూడక తప్పదు. చివరికి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో, ఏవిధంగా ముగుస్తుందో ఎవరికీ తెలియదు.