పీపుల్స్ మార్చ్ నుంచి డిప్యూటి సీఎం వరకు...
posted on Dec 7, 2023 3:14PM
కాంగ్రెస్ పార్టీని తిరిగి విజయతీరాలకు చేర్చిన ముఖ్యుల్లో సీనియర్ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తన మార్కును నిరూపించారు. ఈ కారణంగానే ఆయనకు ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి పదవి వరించింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారానికి ఆమడ దూరంలో ఉన్న కాంగ్రెస్ ను 2004లో అధికారంలో తీసుకువచ్చిన వైఎస్ రాజశేశరరెడ్డి అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన సీఎల్పి నేతగా భట్టి విక్రమార్క పాదయాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువై అధికారంలో తీసుకురాగలిగారు. ఈ సంవత్సరం మార్చి6న ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 108 రోజుల పాటు సాగిన పీపుల్స్ మార్చ్ ద్వారా వైఎస్ రికార్డును బ్రేక్ చేశారు. పీపుల్స్ మార్చ్ తన స్వంత జిల్లా ఖమ్మంలో జులై 2న ముగిసింది.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ లో సరికొత్త ఊపు తీసుకు వచ్చింది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించినప్పటికీ లెక్క చేయకుండా భట్టి పాదయాత్ర చేశారు. 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల మీదుగా నిర్విరామంగా 1350 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పాల్గొన్నారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ ను అధికారంలో తీసుకురావడానికి దోహదపడటంతో పాటు ఇతర పార్టీల నాయకుల చెయ్యి అందుకోవడానికి సిద్దమయ్యారు. పాదయాత్ర ముగింపు సందర్బంగా ఖమ్మంలో నిర్వహించే జనగర్జన సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావ్ వంటి నేతలు కాంగ్రెస్ గూటిలో చేరారు.
మల్లు భట్టి ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మధిర శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014 ఎన్నికలలో మధిర శాసన సభ సభ్యునిగా తిరిగిఎన్నికయ్యారు. 2009 నుండి 2011 వరకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా ఉన్నారు. 2011 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు.
మల్లు భట్టివిక్రమార్క 1961 జూన్ 15న మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు. ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించారు. ఈయన అన్న మల్లు అనంత రాములు నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం మాజీ పార్లమెంటు సభ్యుడు. మరో అన్న మల్లు రవి మాజీ పార్లమెంటు సభ్యులు. విక్రమార్క హైదరాబాదులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.విక్రమార్కకు నందినితో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు.ఒకరు సూర్య విక్రమాదిత్య మరొకరు సహేంద్ర విక్రమాదిత్య.
కాంగ్రెస్ లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో చీఫ్ విప్ అయ్యారు. 2011, జూన్ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుండి పోటీచేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 12,329 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క సరికొత్త చరిత్ర సృష్టించారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నియామకమయ్యారు.