మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు?
posted on Sep 27, 2023 11:59AM
మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
అందరి కంటే ముందే 115 అభ్యర్థులతో బిఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన రోజే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావ్ మంత్రి హరీష్ రావ్ మీద చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. తనకు మల్కాజ్ గిరి టికెట్ కన్ఫమ్ అయినప్పటికీ తన కొడుకు డాక్టర్ రాహుల్ కు మెదక్ టికెట్ దక్కకపోవడంతో తిరుపతిలో మంత్రి హరీష్ రావ్ టార్గెట్ గా మైనంపల్లి హన్మంత్ రావ్ చేసిన వ్యాఖ్యలు అటు పార్టీలో , పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశమయ్యాయి.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావ్, ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. మైనంపల్లి పై వేటు పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ చివరికి మైనంపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా చేసే వరకు మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించకపోవడంతో రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన పార్టీకే అభ్యర్థులు వెతుక్కునే పరిస్థితి వచ్చింది అని తెలుస్తోంది. మంత్రి మల్లా రెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డి పేరు బయటకు వస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటన రాకపోవడం గమనార్హం. మంత్రి మల్లారెడ్డి పై ఇప్పటికే భూ కబ్జా ఆరోపణలు వచ్చినప్పటికీ మళ్లీ మేడ్చెల్ అభ్యర్థిగా అతని కే కేటాయించడం పార్టీలో అభ్యర్థుల లేమి సుస్పష్టంగా కనిపిస్తోంది. వివాదాస్పద మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇస్తే మల్కాజ్ గిరి సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోవల్సి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.