మహాత్మా! కేన్సర్‌కేషీట్లపై ఇంత చులకనా?
posted on Sep 25, 2012 9:44AM
.png)
ఉత్తరతెలంగాణాలో సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలకు మహాత్మాగాంధీ ప్రభుత్వ మెమోరియల్ (ఎంజిఎం) ఆసుపత్రి ఒక్కటే పేదలకు అందుబాటులో ఉంది. అయితే ఈ ఆసుపత్రిలో వైద్యాధికారులు కేన్సర్ రోగుల కేషీట్లను భద్రపరిచే విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. గదిలో ఓ మూలన ఈ కేషీట్లు పడేస్తున్నారు. ప్రత్యేకించి ఈ కేషీట్లను ఫైల్ చేయటానికి అవకాశం ఉన్నా అంతగా పట్టించుకోవటం లేదు. అసలే తెలంగాణా జిల్లాల్లో కేన్సర్ వ్యాధిని అంటువ్యాథిలా చూస్తుంటే కనీసం రోగుల పరిస్థితిని తెలియజేసే కేషీట్ల విషయంలో ఆసుపత్రి నిర్వాహకులు నిర్లక్ష్యం చూపటం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. తమ ప్రాంతంలో కేన్సర్ అని చెప్పుకు తిరగలేని పరిస్థితికి తోడు తమ వివరాలున్న కేషిట్లను గాలికి వదిలేయటం ఏమీ బాగోలేదని రోగులు వాపోతున్నారు. ఆసుపత్రిలో రికార్డు మెయింటెన్ చేయటం ఎంత అవసరమో కూడా గుర్తించటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కోసం వచ్చే బంధువులకు వివరాలు చెప్పాలన్నా, భవిష్యత్తులో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఈ కేషీట్ల ఆధారంగా రికార్డు బయటకు వస్తుందన్న విషయాన్ని సిబ్బంది గమనించటం లేదన్నారు. సిబ్బంది అంత చులకనగా వదిలేస్తుంటే దాన్ని వైద్యాధికారి కూడా ప్రేక్షకపాత్రలా చూసీచూడనట్లు ఉండటం తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇకనైనా కేషీట్లను భద్రపరిచి తమ పట్ల ఎంజిఎంకు ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలని కేన్సర్ రోగులు కోరుతున్నారు.