సీబీఐలో వర్గపోరు..నూతన డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్‌

 

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)నూతన డైరక్టర్‌గా తెలుగు ఐపీఎస్ మన్యం నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర అధికారుల పరిపాలన వ్యవహారాలు చూసే డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.తక్షణ విధుల్లో చేరాలని ఉత్వర్వుల్లో పేర్కొనడంతో నాగేశ్వరరావు వెంటనే బాధ్యతలు చేపట్టారు.1986 బ్యాచ్‌కు చెందిన మన్నెం నాగేశ్వరరావు ఒడిశా కేడర్‌ అధికారి. ఒడిశాలో డీజీ హోదాలో పనిచేశారు. ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ విధులు నిర్వహిస్తున్నారు.మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని వరంగల్‌ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్‌‌.

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా మధ్య వర్గపోరుతో మొదలైన అంతర్గత కుమ్ములాటలు,ప్రధాని సీబీఐని భ్రష్టు పట్టిస్తున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేంద్రం దీనిపై దృష్టి సారించింది.ప్రస్తుత డైరెక్టర్‌ అలోక్‌వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాలను కేంద్రం విధుల నుంచి తప్పించింది.వారిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఉన్నత వర్గాలు ఆదేశాలు జారీచేశాయి.పీఎంవోతో పాటు కేంద్ర అధికారుల వ్యవహారాలు చూసే శాఖ నిర్ణయంతో మన్నెం నాగేశ్వరరావును సీబీఐ నూతన డైరెక్టర్‌గా నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది.గతంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ రామారావు తర్వాత ఆ హోదా చేపట్టిన తెలుగు అధికారి ఈయనే కావడం విశేషం.