ఏపీ శాసనమండలి సోమవారానికి వాయిదా
posted on Sep 19, 2025 3:00PM

వైసీపీ నేతల గందరగోళం మధ్య శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యకళాశాలల అంశంపై చర్చించాలంటూ వైసీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్మించారు. బీఏసీ సమావేశంలో వైద్యకళాశాలపై చర్చిస్తామని ఛైర్మన్ చెప్పారు. మరోవైపు జీఎస్టీ సంస్కరణల అంశంపై స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను మండలి ఛైర్మన్ కోరారు. సభలో ఆర్డర్‌లో ఉంచాలని పయ్యావుల విజ్ఞప్తి చేశారు. వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో మండలి ఛైర్మన్ మోషేనురాజు సభను సోమవారానికి వాయిదా వేశారు.
వైద్యశాలల అంశంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మండలి ఛైర్మన్ మోషేనురాజు ప్రశ్నోత్తరాలు చేపడుతున్న సమయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు టీడీపీ సభ్యులు కూడా వైసీపీకు పోటీగా నినాదాలు చేశారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాలు పూర్తయినట్లు ఛైర్మన్ ప్రకటించారు. వైద్యకళాశాలలపై స్వల్ప చర్చ చేపట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామని.. సభ సజావుగా జరిగేలా సహకరించాలని వైసీపీ సభ్యులను ఆయన కోరారు.