లక్ష్మీపార్వతికి విలువే లేదా?
posted on Sep 18, 2012 10:26AM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సతీమణిగా యావత్తు రాష్ట్రానికి పరిచయమైన లక్ష్మీపార్వతికి ఆది నుంచి అస్సలు విలువ ఇచ్చేవారే కరువయ్యారు. ఆమె మాటతీరు కూడా అంతగా బాగుండ దని పరిచయస్తులు స్పష్టం చేస్తుంటారు. అంతేకాకుండా లక్ష్మీపార్వతి మాటలో కూడా గ్రామీణయాస కొట్టొచ్చినట్లు వినిపిస్తుంది. చదువులో ఎంత ఉన్నతస్థాయి సాధించినా ఆమె మాటతీరు మారకపోవటం వల్ల అదే కొంత వరకూ ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టిందని అనుకోవచ్చు. అయితే నందమూరి కుటుంబం మొదటి నుంచి ఈమెను దూరంగా పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈమె మాత్రం వారిని దగ్గర చేసుకునేందుకు కృషి చేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనూ ఈమెకు పరాభవం తప్పలేదు. ఎన్టీఆర్ మరణానంతరం ఆమెను దాదాపుగా వెలి వేసినట్లే లెక్క. ఎన్టీఆర్ బతికి ఉన్నంత కాలమే ఈమె కొంత సౌఖ్యాన్ని అనుభవించారు. అప్పట్లో ప్రారంభమైన నిరసనలు ఇప్పటికీ లక్ష్మీపార్వతిని వెంటాడుతూనే ఉన్నాయి.
ఎన్టీఆర్‌ను గుర్తించిన ప్రజలు తనను అభిమానిస్తారన్న నమ్మకంతో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అధికారం కోసం పోరాడి భంగపడ్డారు. ఎన్టీఆర్ అంత్యకాలంలో దగ్గరగా ఉన్న సన్నిహితులందరూ లక్ష్మీపార్వతికి మద్దతు ప్రకటించారు. మామను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్న చంద్రబాబుతో ఈమె ప్రత్యక్షపోరు సలిపారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని ఈమె చేసిన వ్యాఖ్య అప్పట్లో సంచలనమైంది. ఆ తరువాత కాలం కలిసివస్తుందని ఆశించారు. అయితే ఆమె నిరాశే అయింది. ఎన్టీఆర్‌తెలుగుదేశం పార్టీని అంతగా ఆదరించలేదు. అయితే కుటుంబపరంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని వదులుకోవటానికి లక్ష్మీపార్వతి ఎప్పుడూ సిద్ధంగా లేదు. ఆమె ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. ఇటీవల ఉప ఎన్నికల్లో వైకాపా తరుపున అన్ని నియోజకవర్గాల్లోనూ లక్ష్మీపార్వతి ప్రచారం చేశారు.
మొదటి నుంచి ఎవరు విన్నా వినకపోయినా తాను చెప్పుకుపోవటానికి అలవాటు పడ్డ లక్ష్మీపార్వతి నందమూరి కుటుంబానికి సంబంధించి ఎటువంటి చిన్న సమస్య వచ్చినా స్పందిస్తుంటారు. ఒక అభిమానిగా ఎన్టీఆర్‌కు పరిచయమై అర్థాంగిగా మారినా, ఎన్టీఆర్ ప్రసంగశైలిని దగ్గర నుంచి గమనించి పిహెచ్‌డి పొందినా లక్ష్మీపార్వతి వైఖరి మారక పోవటం గమనార్హం. ధీటుగా స్పందించే గుణమున్నా ఆకట్టుకునే ఆహార్యం అస్సలు ఈమెకు లేదు. నవ్వును, ఎడుపును, తన భావనలను ఏమీ దాచుకోని లక్ష్మీపార్వతి తాజాగా నందమూరి కుటుంబంపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ వారసుడు హరికృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయంపై ఆమె నిప్పులు చెరిగారు. వాస్తవానికి తమ గురించే మాట్లాడుతున్నా సరే, లక్ష్మీపార్వతిని నందమూరి కుటుంబమే పట్టించుకోదు. అందువల్ల ఈమె ఎన్టీఆర్ అభిమానులకూ దూరమయ్యారు. పైగా, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నేతగా మారటంతో తెలుగుదేశం పార్టీ ఈమె వ్యాఖ్యలపై కిందిస్థాయి కార్యకర్తలతో సమాధానాలిప్పిస్తోంది. ప్రత్యేకించి చంద్రబాబు ఎక్కడ ప్రసంగించినా లక్ష్మీపార్వతి ప్రస్తావన వస్తే ఘాటైన పదజాలంతో వాడైన విమర్శనాస్త్రాలను సంధిస్తుంటారు. తాజాగా లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్య కూడా ఇలాంటిదే. చంద్రబాబు వారసుడు నారా లోకేష్ కోసం హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమాధానం ఇవ్వమని సినీనటుడు బాలకృష్ణను చంద్రబాబు ఆదేశిస్తారని ఆ పార్టీశ్రేణులు చెబుతున్నాయి.