మటంపల్లిలో ఇనుప యుగపు ఆనవాళ్లు

క్రీ.పూ.1000 ఏళ్లనాటి నిలువురాయి
కాపాడుకోవాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి

సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌ మండలం, మటంపల్లిలో ఇనుపయుగపు ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం సభ్యులు, అహోబిలం కరుణాకర్‌, నసీరుద్దీన్‌, చంటి ఇచ్చిన సమాచారం మేరకు గురువారం నాడు, ఆయన మటంపల్లి పాత శివాలయం దారిలో రోడ్డు పక్కనే ఉన్న 12 అడుగల ఎత్తు, 5 అడుగల వెడల్పు, 6 అంగుళాల మందం ఉన్న నిలువురాయి (స్మారకశిల)ని క్షుణ్ణంగా పరిశీలించి మటంపల్లి క్రీ.పూ.1000 ఏళ్ల నాటి ఇనుపయుగపు స్థావరమని చెప్పారు.

ఆకాలంలో మరణించిన వారిని ఒక గుంటలో పూడ్చి, పైన మట్టితో కప్పి, గుర్తుగా ఒక స్మారక శిలను నిలిపే ఆచారముండేదని, అందులో భాగంగానే ఈ నిలువురాతిని ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పారు. పురావస్తు, చారిత్రక ప్రాధాన్యతగల ఈ నిలువురాయిని కాపాడుకోవాలని మటంపల్లి గ్రామస్థులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన హుజూర్‌నగర్‌ బార్‌కౌన్సిల్‌ అధ్యక్షులు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్‌ సాముల రామిరెడ్డికి శివనాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.