గ్రేటర్ లో బీజేపీ బిగ్ ఫైట్.. సీపీకీ కేటీఆర్ కంప్లైంట్ 

ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. టీఆర్ఎస్ సర్కార్ పై దూకుడుగా వెళుతోంది బీజేపీ. గ్రేటర్ హైద్రాబాద్‌లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య  వార్ నడుస్తోంది. జీహెచ్ఎంసీలో మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు హంగామా చేశారు. మేయర్ చాంబర్ లోకి చొరబడి విధ్వంసం స్పష్టించారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సీఎం కేసీఆర్ ఫోటోలను తీసి పడేశారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్పొరేటర్లకు తాలిబన్లకు తేడా లేకుండా పోయిందని మేయర్ గద్వాల విజయలక్ష్మి మండిపడ్డారు. 

తాజాగా జీహెచ్ఎంసీ కార్యాల‌యంపై బీజేపీ కార్పొరేట‌ర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రవంగా స్పందించారు. బీజేపీకి చెందిన కొందరు పోకిరీలు, దుండగులు.. జీహెచ్ఎంసీ కార్యాలయపై దాడికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ కార్పొరేట‌ర్లు రౌడీలు, గుండాల్లా వ్య‌వ‌హ‌రించారని ఆయన ట్వీట్ చేశారు. గాడ్సే భ‌క్తులు గాంధీ మార్గాన్ని అనుస‌రిస్తార‌ని ఎలా అనుకుంటారని ట్వీట్టర్ ద్వారా విమర్శించారు కేటీఆర్. ఈ ఘ‌ట‌న‌పై చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైద‌రాబాద్ సీపీకి విజ్ఞ‌ప్తి చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇక బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేసిన ప్రాంతంలో పాలతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు గులాబీ కార్పొరేటర్లు.  డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత సారధ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీ బోర్డుకు పాలాభిషేకం చేసి, మేయర్ ఛాంబర్ వద్ద శుద్ధి నిర్వహించారు. బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ మేయర్ కు వినతి పత్రపత్రం ఇచ్చారు. విధ్వంసం చేసిన బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు ఈ సందర్భంగా శ్రీలతా రెడ్డి చెప్పారు. బహుజన మహిళ  మేయర్‌గా ఉండడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. మేయర్ కార్యాలయంలో ఉన్నది ప్రభుత్వ ఆస్తి అని, దానిని ధ్వంసం చేయడం సరికాదన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు శ్రీలతా రెడ్డి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu