టీఆర్ఎస్ లో కేటీఆర్ మార్క్

 

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి.. పార్టీపై పూర్తి అధికారాలు కట్టబెట్టాక టీఆర్ఎస్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు లోక్ సభకు ఎంపీల ఎంపికతో పాటు ఎమ్మెల్యేల్లో ఎవరిని మంత్రులుగా చేయాలో పూర్తి అధికారులు కేటీఆర్ చేతిలో పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళితే కేటీఆరే ముఖ్యమంత్రి కావడంతో మంత్రివర్గం పై కేటీఆర్ కు పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రి వర్గంలో అనుభవజ్ఞులు యువ మంత్రులను మిక్స్ చేసి మిశ్రమ మంత్రివర్గాన్ని తయారు చేయాలని కేటీఆర్ కు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. దీంతో కేటీఆర్ ఈ విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్న కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల దిశగా మరో అడుగు ముందుకేశారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ మరోసారి పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయణ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అయితే కరీంనగర్ నుంచి ఎంపీగా ఈసారి కేసీఆర్ పోటీచేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాడని వార్తలొచ్చిన నేపథ్యంలో వినోద్ కే టికెట్ అని కేటీఆర్ ప్రకటించడం టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక తన బావ మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ సీటును ఇచ్చి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయించాలని కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది కాదంటే రాజ్యసభ సీటు ఇచ్చి హరీష్ రావును జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి ఇక్కడ సీఎం పోస్టును తాను పదిల పరుచుకోవాలని కేటీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది.