అమరావతిలో తొలి తీర్పు చెప్పిన హైకోర్టు

 

ఇన్నాళ్లు హైదరాబాద్ లో ఉమ్మడి హై కోర్టులో కార్యకలాపాలు కొనసాగించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు..ఈ నెల ఒకటో తేదీ నుంచి వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ లో.. ఏపీ హైకోర్టు అమరావతిలో కేసుల విచారణను చేపట్టారు. అమరావతికి తరలివెల్లిన తర్వాత ఏపీ హైకోర్టు తన తొలి తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌ బేవరేజీ కార్పొరేషన్‌ (ఏపీబీసీఎల్‌) కొత్త మద్యం గోడౌన్లలో 40 మంది హమాలీలను అనుమతించాలని హమాలీ సంఘం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. విజయవాడ, గొల్లపూడిలో ఏపీబీసీఎల్‌ మద్యం గోడౌన్‌ నిర్వహించేది. ఇందులో పలువురు హమాలీలు పనిచేసేవారు. అనంతరం నిడమానూరులో కొత్త మద్యం గోడౌన్‌ను ఏపీబీసీఎల్‌ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గొల్లపూడి గోడౌన్‌లో పనిచేస్తున్న హమాలీల్లో 40 మందిని నిడమానూరు గోడౌన్‌లో పనిచేసేందుకు అనుమతించాలని కోరుతూ ఏపీబీసీఎల్‌ ఐఎంఎఫ్‌ఎల్‌ హమాలీల సంఘం ఏపీబీసీఎల్‌కు వినతిపత్రం సమర్పించింది.

అధికారులు తమ అభ్యర్థనను తోసిపుచ్చడంతో యూనియన్‌ అధ్యక్షుడు సతీష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చారు. దీనిపై సతీష్‌ దాఖలు చేసిన అప్పీల్‌ తాజాగా ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కొత్త గౌడన్లలో 40 మంది హమాలీలను అనుమతిస్తే అక్కడి స్థానిక, స్థానికేతర హమాలీల మధ్య వివాదం చెలరేగే ప్రమాదం ఉందని వాదనలు కొనసాగాయి. దీనిపై ధర్మాసనం సతీష్ దాఖలు చేసిన అప్పీల్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.