రేపిస్టులను చంపేద్దాం సార్.. ప్రధాని మోదీని కోరిన కేటీఆర్

 

ప్రియాంక రెడ్డి హత్య తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆమె పేరును దిశాగా మార్చారు పోలీసు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో దిశా హత్యను ఖండిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో దిశా నిందితులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చిన విద్యార్థులు రేపిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిశా హత్య ఘటన పై విద్యార్థులు మండిపడ్డారు. మహిళలు, యువతులపై జరుగుతున్న దాడులను ఖండించారు. దిశ హత్య కేసులో నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

శంషాబాద్ లో దిశా నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితులను తమ దగ్గరికి తీసుకు వచ్చి బహిరంగంగా ఉరితీయాలి అంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. తమ ఇంటి దగ్గరకు ఎవరూ రావద్దని దిశా కుటుంబ సభ్యలు వేడుకున్నారు. కాలనీ ఎంట్రెన్స్ గేటుకు తాళాలు వేసుకున్న స్థానికులు తమ కాలనీలోకి రావద్దంటూ తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని అభ్యర్థించారు. 

మరోవైపు దిశ హత్యోదంతంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. మన మధ్యనే మానవ మృగాలు తిరుగుతున్నాయి అన్నారు సీఎం కేసీఆర్. దిశా హత్యాచారంపై ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో స్పందించారు ఆయన. దీన్ని దారుణమైన అమానూషమైన ఘటనగా అభివర్ణించారు కేసీఆర్. 

ఇక ట్విట్టర్ లో మరోసారి స్పందించిన మంత్రి కేటీఆర్ రేపిస్టులకు కఠిన శిక్ష పడేలా చట్టాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్భయ హత్యాకాండ జరిగి 7 ఏళ్లు అయ్యిందని గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదని ఇలాంటి పరిస్థితుల్లో దిశా కుటుంబానికి హామీ ఎలా ఇవ్వగలమని ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. అత్యాచారాలకు పాల్పడే మృగాళ్లు భయపడే విధంగా చట్టాన్ని సవరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు ఆయన. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని ఈ సమావేశాల్లోనే రేపిస్టులకు ఉరిశిక్ష విధించే చట్టాన్ని తీసుకు రావాలని ట్విటర్ లో పేర్కొన్నారు కేటీఆర్. 

వరంగల్లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిపి చంపేసిన ఉన్మాదికీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్ష విధిస్తే హై కోర్టు యావజ్జీవ శిక్షగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం ఆలస్యమైతే బాధితులకు అన్యాయం జరిగినట్టే అన్నారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడినవాళ్లు దోషిగా తేలితే మళ్లీ తీర్పు పై సమీక్ష లేకుండా శిక్షలు ఉండాలని అభిప్రాయపడ్డారు కేటీఆర్. వేలాది మంది పౌరుల తరపున ప్రధానికి ఈ విషయం పై విజ్ఞప్తి చేస్తున్నట్టుగా చెప్పారు. అటు మహిళలు విద్యార్థినులు బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోందని కత్తులు తుపాకులు ఇస్తే మృగాళ్ల నుంచి రక్షణ ఉంటుందన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దిశ హత్యను ఖండిస్తూ నిరసనలు జరిగాయి. దిశా మృతి పై ప్రతి ఒక్కరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల పోస్ట్ లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.