నిధులపై కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించిన కేటీఆర్...

జీఎస్టీ బకాయిలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై పార్లమెంటులో నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు, కొన్ని అంశాలపై అవసరమైతే ప్రభుత్వంతో పోరాడాల్సిందిగా సూచించారు. తెలంగాణ పథకాలకు ప్రశంసలు దక్కాయి గాని ఆరేళ్ళల్లో ప్రత్యేక నిధులు ఇవ్వలేదని కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ ఎంపీలతో చర్చించారు. తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో గళమెత్తాలని వారికి స్పష్టం చేశారు కేటీఆర్. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డ కేటీఆర్ జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయి నిధులపై పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించటం పైన సభలో కేంద్రాన్ని డిమాండ్ చేయాలని చెప్పారు.

రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడం పైన ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న విభజన హామీలపై పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని పార్టీ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు సంబంధిత మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. పౌరసత్వ సవరణ చట్టం సీఎఎపై అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చ జరిపారు.